కేరళలోని పథనంతిట్ట జిల్లాలో ఇద్దరు మహిళల నరబలి ఘటనలో వెలుగులోకి వస్తున్న విషయాలు తీవ్ర దిగ్బ్రాంతి కలిగించే విధంగా ఉన్నాయి. అయితే తాజాగా అదే జిల్లాలోని మలయాళపుజా గ్రామంలో పిల్లలను ఉపయోగించి చేతబడి చేస్తున్న మహిళ వ్యవహారం బయటికి వచ్చింది.  

కేరళలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. పథనంతిట్ట జిల్లాలో ఇద్దరు మహిళల నరబలి ఘటనలో వెలుగులోకి వస్తున్న విషయాలు తీవ్ర దిగ్బ్రాంతి కలిగించే విధంగా ఉన్నాయి. అయితే తాజాగా అదే జిల్లాలోని మలయాళపుజా గ్రామంలో పిల్లలను ఉపయోగించి చేతబడి చేస్తున్న మహిళ వ్యవహారం బయటికి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి తాంత్రిక పూజలు చేస్తున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాుల.. మలయాళపుజా పట్టణానికి చెందిన శోభన అలియాస్ వాసంతి క్షుద్ర పూజలు చేస్తున్నది. చిన్న పిల్లలను తన ముందు కూర్చోబెట్టి తాంత్రిక కార్యాలు నిర్వహిస్తుంది. ఈ క్షుద్ర పూజల కేంద్రానికి ‘వాసంతి మాడమ్’ అని పేరు పెట్టింది.

శోభన ముందు క్షుద్ర పూజలో పాల్గొన్న ఒక చిన్నారి స్పృహతప్పి పడిపోయినట్టుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ ఘటనపై మలయాళపుజా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే డీవైఎఫ్‌ఐ, బీజెపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు.. మహిళపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ఆమెను అదుపులోకి తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు శోభనను, ఆమె భర్తను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక, గతంలో కూడా శోభనపై అనేక ఫిర్యాదులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 

Also Read: నరబలికి ముందు రేప్.. భర్త కళ్లెదుటే భార్యపై షఫీ అత్యాచారం?

ఈ ఘటనపై జిల్లాకు చెందిన శాసన సభ్యురాలు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందిస్తూ.. పిల్లలను ఇలాంటి కిరాతక కార్యకలాపాలకు ఉపయోగించుకుంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. “ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా మొత్తం సమాజం ఉమ్మడిగా పోరాడాలి’’ అని ఆమె అన్నారు.

ఇక, మలయాళపుజా చేతబడి కేసులో సమగ్ర విచారణ జరిపిస్తామని పథనంతిట్ట ఎస్పీ తెలిపారు. డీఎస్పీ నేతృత్వంలో కేసు దర్యాప్తు చేయనున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు. జిల్లాలోని మరెక్కడైనా ఇలాంటివి జరుగుతాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతామని ఎస్పీ తెలిపారు.