Agra: ఢిల్లీలో బీభత్సం సృష్టించిన యమునా నది ఆగ్రాలో 495.8 అడుగులకు పెరిగి, 'తక్కువ వరద స్థాయి' మార్కును దాటి చారిత్రాత్మ‌క క‌ట్ట‌డం తాజ్ మహల్ గోడలకు చేరుకుంది. య‌మునా వ‌ర‌ద నీరు తాజ్ మ‌హ‌ల్ ను తాక‌డం 45 సంవత్సరాల త‌ర్వాత క‌నిపించింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన విజువల్స్ ప్రకారం, యమునా జలాలు తాజ్ మ‌హ‌ల్ వెనుక ఉన్న తోటను ముంచెత్తడం క‌నిపించింది. యమునా నది చివరిసారిగా 1978లో వచ్చిన వరదల సమయంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని తాకింది. 

Rising Yamuna reaches walls of Taj Mahal: దాదాపు 45 సంవత్సరాల త‌ర్వాత యమునా నది నీరు ఆగ్రాలోని తాజ్ మహల్ కాంప్లెక్స్ బయటి గోడలకు చేరుకుంది. ఢిల్లీలో బీభత్సం సృష్టించిన యమునా నది ఆగ్రాలో 495.8 అడుగులకు పెరిగి, 'తక్కువ వరద స్థాయి' మార్కును దాటి చారిత్రాత్మ‌క క‌ట్ట‌డం తాజ్ మహల్ గోడలకు చేరుకుంది. య‌మునా వ‌ర‌ద నీరు తాజ్ మ‌హ‌ల్ ను తాక‌డం 45 సంవత్సరాల త‌ర్వాత క‌నిపించింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన విజువల్స్ ప్రకారం, యమునా జలాలు తాజ్ మ‌హ‌ల్ వెనుక ఉన్న తోటను ముంచెత్తడం క‌నిపించింది. యమునా నది చివరిసారిగా 1978లో వచ్చిన వరదల సమయంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని తాకింది.

అయితే ఈ స్మారక చిహ్నంలోకి వరద నీరు చేరే అవకాశం లేదని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ను పర్యవేక్షిస్తున్న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు తెలిపారు. "స్మారక చిహ్నంలోకి వరద నీరు ప్రవేశించే అవకాశం లేదు. నిర్మాణం తెలివైన రూపకల్పన అటువంటి బెదిరింపులను తోసిపుచ్చుతుంది. అధిక వరదల సమయంలో కూడా ఈ క‌ట్టడంలోకి నీరు ప్రవేశించదు. యమునా వరద నీరు చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత తాజ్ కాంప్లెక్స్ బయటి గోడలను తాకింది" అని ఏఎస్ఐ (ఆగ్రా) సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ చెప్పారు. మథురలోని ఓఖ్లా, గోకుల్ బ్యారేజీల నుంచి వేలాది క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో సోమవారం రాత్రి అకస్మాత్తుగా కాంప్లెక్స్ వెలుపలి గోడలకు వరద నీరు చేరిందనీ, ఒక్క ఆగ్రాలోనే సుమారు 350 బిఘాల పంటలు నీట మునిగాయని అధికారులు తెలిపారు.

రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది కూడా ఆగ్రాకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం ఆగ్రాలో యమునా నది 498 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 499 అడుగులు, కనిష్ఠ నీటిమట్టం 495 అడుగులుగా ఉంది. రాబోయే రోజుల్లో వరద నీరు 500 అడుగులు దాటే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. దీని కార‌ణంగా తాజ్ మ‌హ‌ల్ కు ఎలాంటి ముప్పు లేనప్పటికీ, నిర్మాణం చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆగ్రాలోని దసరా నదీ తీరం, మెహతాబ్ బాగ్ కు కూడా వరద నీరు చేరిందనీ, సమీప 40 గ్రామాలు త్వరలో ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగ్రా నగరంలోని లోహియా నగర్, తనిష్క్, రాజశ్రీ, దయాల్బాగ్ ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి.

ఆగ్రాలోని సికంద్ర ప్రాంతంలోని కైలాస మహాదేవ్ ఆలయ గర్భగుడిలోకి కూడా నీరు చేరింది. కనీసం వారం రోజుల పాటు వరద నుంచి ఉపశమనం కనిపించడం లేదని, అందుకే ఈ నెల 24న జరగాల్సిన సావన్ మేళాను వాయిదా వేస్తున్నట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఆగస్టు 21న జాతర జరుగుతుందని కైలాస మహాదేవ్ ఆలయ మహంత్ గౌరవ్ గిరి తెలిపారు. కాగా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ పర్వత రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నది నీటిమట్టం పెరిగింది. గత వారం ఢిల్లీలోని యమునా నదిలో నీటి మట్టం గ‌రిష్ట స్థాయికి చేరుకునీ, 45 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. జాతీయ రాజధానిలోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తింది. ఢిల్లీలో యమునా నది ఎర్రకోట బయటి గోడను తాకింది.