ఆదిత్య ఎల్1 లాంచింగ్ విజయవంతం.. ఇస్రోకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము అభినందనలు..
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో మైలురాయిని సాధించింది. సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో రూపొందించిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం లాంచింగ్ విజయవంతమైంది.
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో మైలురాయిని సాధించింది. సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో రూపొందించిన ఆదిత్య ఎల్-1 ఉపగ్రహం లాంచింగ్ విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సి57 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం లాంచింగ్ విజయవంతం అయినట్టుగా ఇస్రో ప్రకటించింది. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ నుంచి ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం విజయవంతంగా వేరు చేయబడిందని ఇస్రో తెలిపింది. ఎల్ 1 పాయింట్ వద్దకు ఉపగ్రహం ప్రయాణాన్ని ప్రారంభించిందని పేర్కొంది.
దీంతో ఇస్త్రో శాస్త్రవేత్తలపై అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ అభినందనలు తెలియజేస్తున్నారు. ‘‘చంద్రయాన్-3 విజయం తర్వాత భారత్ తన అంతరిక్ష యాత్రను కొనసాగిస్తోంది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ ఆదిత్య -L1ని విజయవంతంగా ప్రారంభించినందుకు ఇస్రోలోని మా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అభినందనలు. మొత్తం మానవాళి సంక్షేమం కోసం విశ్వంపై మంచి అవగాహనను పెంపొందించడానికి మన అవిశ్రాంతమైన శాస్త్రీయ ప్రయత్నాలు కొనసాగుతాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
‘‘భారతదేశపు మొట్టమొదటి సోలార్ మిషన్ అయిన ఆదిత్య-ఎల్1 ప్రయోగం భారతదేశ స్వదేశీ అంతరిక్ష కార్యక్రమాన్ని కొత్త పథంలోకి తీసుకెళ్లే ఒక మైలురాయి సాధన. ఇది అంతరిక్షం, ఖగోళ దృగ్విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను నేను అభినందిస్తున్నాను. మిషన్ విజయవంతం కావడానికి నా శుభాకాంక్షలు’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
ఇక, ఇస్రో ఈరోజు ‘ఆదిత్య ఎల్1’ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇస్రో మరో కీలక మైలురాయిని దాటిందని అన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో బృందానికి అభినందనలు తెలియజేశారు. భారతీయ అంతరిక్ష సాంకేతికతను మరింత ఎత్తుకు తీసుకెళ్లే మిషన్‌ను ఇది సాధించాలని ఆకాంక్షించారు.