ఆన్ లైన్ లో లూడో గేమ్ కు బానిసైన ఓ భార్య ఆ వ్యసనంలో పడి డబ్బులు పోగొట్టింది. ఇది తెలిసి భర్త మందలించాడు. దీంతో నగదు, పిల్లల్ని తీసుకుని ఇంట్లోనుంచి పారిపోయింది.

బెంగళూరు : ఆన్లైన్ గేమ్స్ వ్యసనంలో పడి పూర్తిగా నష్టపోతున్న ఘటనలు వింటూనే ఉన్నాం. పబ్జి, ఆన్లైన్ రమ్మీ.. వరుసలో తాజాగా లూడో కూడా చేరింది. సరదాగా ఆడుకునే లూడో గేమ్ కు బానిసై ఓ వివాహిత రూ. నాలుగు లక్షలకు పైగా డబ్బులను నష్టపోయింది. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో ప్రవర్తన మార్చుకోవాలంటూ మందలించారు. అయినా వ్యసనానికి బానిసైన ఆమె ఆ మాట వినలేదు.

చివరికి ఆట కోసం కుటుంబాన్ని వదులుకోవడానికి సాహసించింది. ఇంట్లో ఉన్న నగదు, తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయింది. పోతూ పోతూ.. నగదు తీసుకుని పోతున్నందుకు తనను క్షమించాలంటూ ఉత్తరం కూడా రాసి పెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…

శాండల్‌వుడ్ నటుడు, దర్శకుడు ఉపేంద్రపై అట్రాసిటీ కేసు.. క్షమాపణలు చెప్పిన హీరో..

బెంగళూరుకు చెందిన ఓ వివాహిత,ఇద్దరు పిల్లల తల్లి.. ఆన్లైన్లో లూడో గేమ్ అలవాటయింది. ఏడాదికాలంగా అలా ఆమె లూడో ఆడుతుంది. ఆన్లైన్లో ఆడేటప్పుడు డబ్బులు పందెం పెట్టాల్సి ఉంటుంది. అలా మొదటిసారి రూ.50 వేలు పోగొట్టుకుంది. తను పోగొట్టుకున్న డబ్బును తిరిగి సంపాదించుకోవడం కోసం తన బంగారు నగలను తాకట్టు పెట్టింది. అలా రూ.1.25 లక్షలు అప్పు తీసుకుంది.

ఆ డబ్బులతో మళ్లీ పందెం కాసి గేమ్ ఆడింది. ఈ సారి కూడా డబ్బులు పోగొట్టుకుంది. అయినా అక్కడితో ఆమె ఆగలేదు. బంధువుల దగ్గర రూ.1.75 లక్షలు అప్పుగా తీసుకుంది. ఇంత డబ్బు అప్పుగా తీసుకున్నా.. నగలు తాకట్టు పెట్టినా.. డబ్బులు పోగొట్టుకున్నా…ఆ విషయం భర్తకు తెలియకుండా జాగ్రత్త పడిందామె.

అయితే, ఈ విషయం ఎలాగో భర్తకు తెలిసింది. వెంటనే ఆమెను గట్టిగా మందలించాడు. భర్త కోపానికి రావడంతో.. మళ్ళీ లూడో ఆడనని, దానికోసం అప్పులు చేయనని వాగ్దానం చేసింది. అయితే, ఒకసారి వ్యసనానికి అలవాటు పడిన తర్వాత దాని నుండి బయటపడడం అంత సులభం కాదు. అలా ఆమె జూలై 19వ తేదీన మళ్లీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టింది, రూ.1.20 లక్షలు అప్పుగా తీసుకుంది. 

ఆ నగదును మళ్లీ లూడోలో పెట్టింది. ఇది భర్తకు తెలిసింది. తను అంత కోప్పడ్డా కూడా ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈ విషయం మీద భార్య తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. కూతురికి సర్ది చెప్పాలని.. దారిలో పెట్టాలని కోరాడు. ఆ తర్వాత ఆగస్టు 8వ తేదీన తన పెద్ద కొడుకును స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంటిదగ్గర వదిలేశాడు భర్త. 

 ఆ తరువాత మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పని ఉందని బయటికి వెళ్ళాడు. కాసేపటి తర్వాత బయటినుంచి భార్యకు ఫోన్ చేశాడు. కానీ, సమాధానం లేదు. దీంతో ఏదో అనుమానం వచ్చిన భర్త ఇంటికి వెళ్లి చూడగా.. ఇంటికి తాళం వేసి ఉంది. తన దగ్గర ఉన్న మారుతాళంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్ళాడు. లివింగ్ రూమ్ లో అతనికి ఓ లెటర్ కనిపించింది. 

అందులో ఇలా రాసి ఉంది. ’ నన్ను క్షమించండి.. మీరు ఇంట్లో దాచిపెట్టిన డబ్బు తీసుకెళ్తున్నాను. మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను’ అని భార్య చేతిరాతతో రాసి ఉంది. అది చూసి షాక్ అయిన భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. లూడోకు బానిస అయిన తన భార్య పిల్లలను తీసుకుని ఎక్కడికో పోయిందని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతని భార్యా పిల్లల కోసం గాలిస్తున్నారు.