అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ లీడర్ జయ ఠాకూర్ దాఖాలు చేసిన పిల్ పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
అదానీ హిండెన్‌బర్గ్ కేసు: దేశ వ్యాప్తంగా చర్చనీయం అంశంగా మారిన అదానీ-హిండెన్‌బర్గ్ కేసును సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17న విచారించనుంది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ లీడర్ జయ ఠాకూర్ వేసిన పిల్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ ఫిబ్రవరి 17న ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం పేర్కొన్నది.
తొలుత ఈ పిటిషన్‌ను ఈ నెల 24న జాబితా చేయడానికి బెంచ్ అంగీకరించింది. కానీ, ఇప్పటికే ఇదే వ్యవహారంపై దాఖలైన మరో రెండు పిల్స్‌ను ఈ నెల 17న విచారించాలని జాబితా చేయబడినట్టు పిటిషన్‌దారు తరపు న్యాయవాది ప్రస్తావించారు. దీంతో.. కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్ దాఖాలు చేసిన పిల్ ను అదే రోజున విచారణ చేస్తామని జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది. అదానీ హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని జయా ఠాకూర్ తన పిల్‌లో కోరారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ పెట్టుబడులు పెట్టడంపైనా కూడా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు.. సోమవారం (ఫిబ్రవరి 13) విచారణ సందర్భంగా.. స్టాక్ మార్కెట్ పనితీరును మెరుగుపరచడానికి కమిటీని ఏర్పాటు చేయడానికి తమకు అభ్యంతరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే విదేశీ పెట్టుబడులపై ప్రభావం పడకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది. కేంద్రం తన సూచనలను సీల్డ్ కవర్‌లో కమిటీ సభ్యులకు సమర్పించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. గత విచారణలో ఇన్వెస్టర్ల సొమ్ము మునిగిపోవడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి నష్టాల నుంచి ప్రజలను కాపాడేందుకు వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం, సెబీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఎదుర్కోవడానికి మార్కెట్ రెగ్యులేటర్ , ఇతర చట్టబద్ధమైన సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్యానెల్ ఏర్పాటుపై ఏదైనా "అనుకోకుండా" సందేశం వచ్చినా నిధుల ప్రవాహంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మెహతా భయపడ్డారు.
చివరి విచారణలో ఏం జరిగింది?
అంతకుముందు, అదానీ-హిండెన్‌బర్గ్ కేసు విచారణ ఫిబ్రవరి 10న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ,జెబి పార్దీవాలాలతో కూడిన ధర్మాసనంలో జరిగింది. ఈ సమయంలో.. సలహాలు ఇవ్వడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయవచ్చని కోర్టు సూచించింది. షార్ట్ సెల్లింగ్ ద్వారా మార్కెట్‌పై అతి తక్కువ సమయంలో తీవ్ర ప్రభావం పడిందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అభిప్రాయ పడ్డారు.
దీంతో ఇన్వెస్టర్లకు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందనీ. ధనవంతులు మాత్రమే స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం కాదని, మధ్యతరగతి ప్రజలు కూడా పెట్టుబడి పెట్టాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వచ్చిన తర్వాత మార్కెట్ పతనానికి గల కారణాలపై సమాచారం ఇవ్వాలని కోర్టు కోరింది. అలాగే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
