తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎనిమిదో రోజుకు చేరింది. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది.

తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎనిమిదో రోజుకు చేరింది. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది. గత రాత్రి బస చేసిన బోయిన్ పల్లి నుంచి రాహుల్ గాంధీ బుధవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి బాలానగర్, హబీబ్ నగర్, మూసాపేట, ఐడీఎల్ జంక్షన్, కూకట్ పల్లి, మియాపూర్, మదీనగూడ మీదుగా సాగింది. భోజన విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ పాదయాత్రను తిరిగి ప్రారంబించనున్నారు. సాయంత్రం రామచంద్రాపురం, పఠాన్ చెరువు మీదుగా రాహుల్ పాదయాత్ర సాగనుంది. పఠాన్ చెరువు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాటి ముత్తంగి వరక పాదయాత్ర సాగనుంది. రుద్రారంలో రాహుల్ గాంధీ బస చేస్తారు. 

రాహుల్ గాంధీ పాదయాత్రలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. నిజాంపేట కూడలి వద్ద రాహుల్‌కు మహిళలు భోనాలతో స్వాగతం పలికారు. అందరికి అభివాదం చేస్తూ ఉత్సాహంతో రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. బుధవారం ఉదయం రాహుల్ పాదయాత్రలో బాలీవుడ్ నటి, నిర్మాత పూజా భట్ పాల్గొన్నారు. 

భారత్ జోడో యాత్ర పాల్గొన్న పూజా భట్ రాహుల్‌తో కలిసి కొంతసేపు నడిచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘‘రోజుకో కొత్త చరిత్ర సృష్టిస్తోంది... దేశంలో ప్రేమను ప్రేమించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది’’ అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ సందర్భంగా పూజా భట్ రాహుల్‌తో పలు విషయాలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అయితే రాహుల్ పాదయాత్రలో పాల్గొన్న తొలి బాలీవుడ్ సెలబ్రిటీగా పూజా భట్ నిలిచారు. ఇక, ఇటీవల టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ కూడా భారత్ జోడో యాత్రలో చేరి రాహుల్ గాంధీ వెంట నడిచిన సంగతి తెలిసిందే.

Scroll to load tweet…


ఇక, రాహుల్ పాదయాత్ర మంగళవారం ఉదయం హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించింది. మంగళవారం సాయంత్రం చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నెక్లెస్ రోడ్డులో జరిగిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించారు. నెక్లెస్‌ రోడ్డులో జరిగి కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. 

2016లో ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ యూనివర్సిటీ దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక వేముల మంగళవారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. తనను కలిసిన రోహిత్ తల్లిని రాహుల్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆరెస్సెస్ నుంచి రాజ్యాంగాన్ని రక్షించాలని ఆమె రాహుల్ గాంధీని కోరారు.