97శాతం మార్కులు సాధించిన అందాల తార

సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం ఉత్తీర్ణత 86.70 శాతం. బాలురు ఉత్తీర్ణత శాతం 85.32 కాగా, బాలికల ఉత్తీర్ణత శాతం 88.67గా ఉంది.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాసిన ఒడియా సినీ హీరోయిన్‌ భూమిక దాస్‌ 97 శాతం మార్కులతో పాస్ అయ్యింది. భూమిక ఇటీవల విడుదలైన ‘హీరో నెంబర్‌ వన్‌’, ‘తుమో లవ్‌ స్టోరీ’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులను అలరించింది. పాస్ అయిన సంతోషాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతోనే తాను ఈ మార్కులు సాధించినట్లు భూమిక చెప్పింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 16,38,420 మంది ఈ పరీక్షలు రాయగా భువనేశ్వర్‌ రీజనల్ నుండి 77 వేల మంది పరీక్షలకు హాజరయ్యారు.

గురుగ్రామ్‌కు చెందిన ప్రఖర్ మిట్టల్, బిజ్నార్‌కు చెందిన రిమ్జిమ్ అగర్వాల్, శంలీకి చెందిన నందిని గార్గ్, కొచ్చికి చెందిన జి శ్రీలక్ష్మి సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్లో 500కు 499 మార్కులు సాధించారు.