న్యూఢిల్లీ:ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1975 నుండి 1977 మధ్యలో ఎమర్జెన్సీని విధించడం ముమ్మాటికీ తప్పేనని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు కరోనాల్ యూనివర్శిటీకి చెందిన వారితో వీడియో కాన్పరెన్స్ లో రాహుల్ గాంధీ మాట్లాడారు.

ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ హక్కులు, పౌర హక్కులు నిలిపివేయబడ్డాయని ఆయన చెప్పారు. మీడియాను పరిమితం చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. చాలా మంది విపక్ష నేతలను జైల్లో నిర్భంధించినట్టుగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు భిన్నంగా ఉందన్నారు.

ఇది పొరపాటు, అని నేను అనుకొంటున్నాను. అది ఖచ్చితంగా పొరపాటేనని ఆయన అభిప్రాయపడ్డారు. నానమ్మ (ఇందిరాగాంధీ) కూడా ఇదే అభిప్రాయాన్ని ఆ తర్వాత వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేసుకొన్నారు.ప్రఖ్యాత ఆర్ధికవేత్త కౌశిక్ బసుతో జరిగిన సంభాషణలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్షను అనుభవించిన నేతలు ఈ అంశంపై కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శించేవారు. 

గత ఏడాది జూన్ లో హొంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ , గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని అధికారం కోసం ఒక కుటుంబం దురాశ దేశాన్ని రాత్రిపూట జైలుగా మార్చిందని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.1975 నుండి 1977 మధ్య ఏం జరిగిందో, ఇవాళ ఏం జరుగుతుందోననే విషయాలకు మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ తన సభ్యులతో అన్ని సంస్థల్లో నింపుతోందని ఆయన ఆరోపించారు.

ఎన్నికల్లో బీజేపీని ఓడించినా సంస్థాగత నిర్మాణంలో వారిని (ఆర్ఎస్ఎస్ భావజాలం) వదిలించుకోవడానికి తాము వెళ్లడం లేదన్నారు.  మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం కూలిపోవడానికి ముందుగా మాజీ సీఎం కమల్ నాథ్ తనకు మధ్య జరిగిన సంభాషణను ఆయన గుర్తు చేసుకొన్నారు.ప్రభుత్వంలోని సీనియర్ బ్యూరోకాట్లు ఆర్ఎస్ఎస్ కు విధేయత చూపిస్తున్నందున తన ఆదేశాలను పాటించడం లేదని తనకు చెప్పారన్నారు.