కేసీఆర్ ప్రయత్నిస్తున్న థర్డ్ ఫ్రంట్ ఆశలపై పంజాబ్‌లో విజయదుందుభి మోగిస్తున్న ఆప్ అనూహ్యంగా నీళ్లు చల్లింది. ఢిల్లీతోపాటు మరో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆప్ స్వయంగా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మారే స్థాయిలో ఉన్నది. ఈ సందర్భంలో కేజ్రీవాల్ ఇతర నేతల నాయకత్వంలోని ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరే అవకాశాలే లేవని ఆప్ నేతలు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: ప్రస్తుతం కేంద్రంలో అధికారంలోని బీజేపీ(BJP)కి ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉన్నది. కానీ, 2014 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పుంజుకున్న దాఖలాలు చాలా అరుదు. బలహీన పార్టీగా మారింది. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనే వాదనలు ఇప్పుడు వినిపించడం లేదు. ప్రాంతీయ పార్టీలూ అలాగే అనుకుంటున్నాయి. బలహీన కాంగ్రెస్‌కు బదులు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలే ఒక కూటమిగా ఏర్పడాలనే ఆలోచనలు చేస్తున్నాయి. 2024 జనరల్ ఎన్నికల్లో బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమిగా ఏర్పడి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) చురుకుగా ఉన్నారు.
టీఆర్ఎస్, టీఎంసీ, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, డీఎంకే వంటి పార్టీలు అన్నీ ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీలు. ప్రాంతీయ పార్టీలు కావడంతో సహజంగానే వాటి ఎజెండాల్లో చాలా వైరుధ్యాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి పనిచేయడానికి పునాది బీజేపీ వ్యతిరేకతే ప్రధానంగా ఉంటుంది. ఒక వేళ థర్డ్ ఫ్రంట్(Third Front) రూపం దాల్చితే.. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉండాలి.
ఇప్పటి వరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ విషయమై కేజ్రీవాల్‌ను అప్రోచ్ కాలేదు. కానీ, ఇంతలోనే కేసీఆర్ ప్రయాణంలో ఓ కుదుపు ఎదురవుతున్నది. ఆయన కలలు కంటున్న థర్డ్ ఫ్రంట్ ఆశలపై పంజాబ్‌లో ఆప్‌ను గెలిపించుకున్న కేజ్రీవాల్ నీళ్లు చల్లినట్టుగానే కనిపిస్తున్నది.
ఎందుకంటే.. ఇప్పుడు కేసీఆర్ లేదా మమతా బెనర్జీ నాయకత్వం వహించే థర్డ్ ఫ్రంట్ కూటమిలో ఆప్ చేరే అవకాశమే లేదు. ఈ ఫ్రంట్‌లో చేరే పార్టీలు అన్నింటిలోకెల్లా ఆప్ ముందంజలో ఉన్నది. మొన్నటి వరకు నగర(ఢిల్లీ) పార్టీగా మాత్రమే ఉన్నట్టు కనిపించిన ఆప్ ఇప్పుడు పంజాబ్‌లోనూ పాగా వేసింది. గోవాలో బోణీ కొట్టింది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల బరిలో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నది. రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కలిగి ఉండనున్న ఈ పార్టీ.. మిగతా అన్ని ప్రాంతీయ పార్టీలకు ఝలక్ ఇచ్చినట్టే అయింది. ఎందుకంటే.. బలహీనమైన కాంగ్రెస్‌కు స్వయంగా ఆప్ ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు లేకపోలేదు. ఈ సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ.. మరే ఇతర నేతలు నాయకత్వం వహించే కూటమిలో చేరాలనే ఆసక్తి చూపించట్లేదని ఆ పార్టీకి చెందిన నేతలే చెబుతున్నారు.
ఇలాంటి భ్రమలను పటాపంచలు చేస్తూ మంగళవార ఆప్ ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు సంధించింది. కేసీఆర్ అహంభావి అని, ఆయన చోటా మోడీ అంటూ విమర్శలు చేసింది. మరో మోడీ అంటూ పోల్చి ఆప్ తన ఉద్దేశాన్ని పరోక్షంగా తేల్చేసింది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇప్పటికే చాలా ఆలస్యం ఏర్పడిందని భావిస్తున్న పార్టీలకు ఆప్ విజయం మరో సవాల్‌ను విసిరింది. మమతా బెనర్జీ, కేసీఆర్ నేతలు తమ రాష్ట్రాలను వదిలి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. ఆ పార్టీ నేతలూ వారిని ప్రధాన మంత్రిగా చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇలాంటి తరుణంలో మరో మెట్టు ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్‌తో పొత్తు వీరికి పొసిగే అవకాశాలు స్వల్పం. ఒక వేళ అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా కూటమి పెట్టే ఆలోచనలు చేసినా.. దానికి తప్పకుండా ఆయనే సారథ్యం వహిస్తారు. అలాంటి సందర్భంలోనూ వీరు అందులో చేరే అవకాశాలు చాలా స్వల్పమే. కాబట్టి, కేసీఆర్ తలపెట్టిన ఫ్రంట్‌పై అనూహ్యంగా ఆప్ విజయం నీళ్లు చల్లినట్టయింది.
