Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్‌లో ఢిల్లీ మాడల్ చెల్లదా? చతికిలపడ్డ ఆప్.. రెండో స్థానంలో కాంగ్రెస్.. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ షాక్ ఇస్తుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ మాడల్‌తో ఆయన గుజరాత్ రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకువస్తారని భావించారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆప్ ప్రభావం రాష్ట్రంలో పెద్దగా లేదని తేల్చాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే మరింత దిగిజారే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. కాగా, బీజేపీ మాత్రం మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేశాయి.
 

aap poor performance in gujarat assembly elections what exit polls showing
Author
First Published Dec 5, 2022, 7:50 PM IST

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈ రోజు ముగిసింది. ఈ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే మొగ్గు చూపాయి. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో న్యూస్ ఎక్స్, జన్ కీ బాత్‌ ఎగ్జిట్ పోల్స్ 117 నుంచి 140 సీట్లను గెలుచుకుంటాయని అంచనా వేశాయి. రిపబ్లిక్ టీవీ పీ మార్క్ ఎగ్జిట్ పోల్స్ 128 నుంచి 148 సీట్లను గెలుచుకునే అవకాశాలున్నాయని తెలిపాయి. టీవీ9 గుజరాతి 125 స్థానాల నుంచి 130 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుందని వివరించాయి. కాగా, కాంగ్రెస్ సగటున 30 స్థానాల నుంచి 50 స్థానాల వరకు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. ఇదిలా ఉండగా గుజరాత్‌లో విస్తృత ప్రచారం చేసిన ఆప్ మాత్రం ఈ రాష్ట్రంలో మూడో స్థానానికే పరిమితం అయ్యే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. న్యూస్ ఎక్స్ ఆప్ పార్టీకి 6 నుంచి 13 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ రెండు నుంచి పది స్థానాలు ఆమ్ ఆద్మీకి వస్తాయని వివరించింది. టీవీ9 గుజరాత్ మూడు నుంచి 5 సీట్లు ఆప్ గెలుచుకుంటుందని అంచనా వేసింది.

గుజరాత్‌లో కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ ప్రచారం, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం ఆప్ అని, బీజేపీతో నేరుగా తలపడుతున్నది ఆమ్ ఆద్మీ పార్టీనే అని ఆప్ నేతలు ప్రచారం చేశారు. కానీ, ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఇక్కడ ఆప్ దారుణంగా చతికిలపడినట్టు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ మాత్రం మరింత దిగజారిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 16 స్థానాలు పెంచుకుని 77 సీట్లు గెలుచుకుంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, ఈ ఎన్నికల్లో ఈ సంఖ్య  మరింత తగ్గిపోయి గరిష్టంగా 50 స్థానాలనే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలు బీజేపీ కంటే నరేంద్ర మోడీకే ప్రతిష్టాత్మకంగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ప్రధాని మోడీ చాలా సార్లు ఈ రాష్ట్రంలో పర్యటించి ర్యాలీలు, రోడ్ షోలు చేపట్టారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు. ఎందుకంటే.. వికాసమే అభివృద్ధి మంత్రం, అని బీజేపీ చేపట్టిన అభివృద్ధి అదీ ముఖ్యంగా నరేంద్ర మోడీ సీఎంగా ఉన్నప్పుడు గుజరాత్‌లో జరిగిన అభివృద్ధి గురించి కమలం పార్టీ ప్రధానంగా మాట్లాడుతుంది. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ గుజరాత్‌ను మోడల్‌గా ప్రకటిస్తుంటాయి. అలాంటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు అంటే.. బీజేపీకి ఒక మూలస్తంభం నిలుపుకునే అవసరం వంటిది.

ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీ మాడల్‌ను ప్రముఖంగా ప్రస్తావిస్తూ గుజరాత్‌లో ప్రచారం చేశారు. స్కూల్స్, హాస్పిటల్స్, ఉచిత విద్యుత్ వంటి అంశాలు ప్రధానంగా పేర్కొంటూ కేజ్రీవాల్ తన క్యాంపెయిన్ చేశారు. ఇది ఒక రకంగా గుజరాత్ మాడల్ వర్సెస్ ఢిల్లీ మాడల్‌కు జరిగిన ఎన్నికలుగానూ మనకు క్యాంపెయిన్‌లో కనిపించింది.

కాంగ్రెస్ ప్రచారం చేసినా.. గాంధీ కుటుంబం పెద్దగా ఇందులో ఇన్వాల్వ్ కాలేదు. బీజేపీకి ప్రత్యర్థిగా రాహుల్ గాంధీ కనిపించకుండా కాంగ్రెస్ జాగ్రత్తపడింది. అయినా కాంగ్రెస్ మొత్తంగా నష్టపోయిందని చెప్పలేం. అయితే, సీట్లు మాత్రం ఎక్కువే తగ్గే అవకాశాలు ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios