Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. గురువారం మధ్యాహ్నం సంజయ్ కుమార్ సింగ్‌ను కోర్టులో హాజరుపరిచే అవకాశం వుంది. 
 

AAP MP Sanjay Singh arrested by ED in Delhi Liquor Scam ksp
Author
First Published Oct 4, 2023, 7:03 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాంతో ముడిపడి వున్న మనీలాండరింగ్ కేసులో సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ స్కాంలో అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరాతో సంజయ్‌కు సంబంధాలు వున్నాయని ఈడీ గుర్తించింది. బుధవారం ఉదయం సంజయ్ నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. అనంతరం ఈడీ కార్యాలయానికి ఎంపీని తరలించారు. ఆపై స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన అనంతరం ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం సంజయ్ కుమార్ సింగ్‌ను కోర్టులో హాజరుపరిచే అవకాశం వుంది. 

ఇకపోతే.. ఇటీవలి కాలంలో పలు కేసుల్లో అరెస్ట్ అయిన ఆప్ నేతల్లో సంజయ్ కుమార్ సింగ్ మూడో వారు. ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాలను ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ సోదాలపై కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ సింగ్‌కు మద్దతుగా మాట్లాడారు. 100 కంటే ఎక్కువ దాడులే చేశారని.. అక్రమంగా సంపాదించిన డబ్బు ఒక్క పైసా కూడా కనుగొనలేదని అన్నారు. ఇవి వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రత్యర్థులను నిలువరించేందుకు చేస్తున్న తీవ్రమైన ప్రయత్నాలు అని ఆరోపించారు. 

Also Read: వేల సార్లు సోదాలు జరిపిన ఒక్క పైసా కూడా లభించలేదు.. ఈడీ సోదాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..

‘‘గత ఏడాదిగా మనం చూస్తున్నాం... మద్యం కుంభకోణం గురించి ఆరోపణలు చేస్తున్నారు. 1000 కంటే ఎక్కువ దాడులు నిర్వహించబడ్డాయి. ఒక్క పైసా కూడా రికవరీ కాలేదు. వారు కేవలం 'స్కామ్' అని ఆరోపిస్తూనే ఉన్నారు. సంజయ్ సింగ్‌ నివాసంలో జరిగిన సోదాల్లో కూడా ఏమీ కనుగొనబడలేదు’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘‘నిన్న జర్నలిస్టులపై దాడి చేశారు, ఈరోజు సంజయ్ సింగ్, రేపు మీపై దాడి చేయవచ్చు. 2024లో ఓటమి ఖాయమైన పార్టీ చేస్తున్న తీరని ప్రయత్నాలు ఇవి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి దాడులు మరిన్ని జరుగుతాయి’’ అని కేజ్రీవాల్ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios