ఈ నెల 16వ తేదీన భగత్ సింగ్ పూర్వీకుల గ్రామంలో తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని భగవంత్ మాన్ తెలిపారు. శనివారం ఆయన పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ ను కలిశారు. ఎమ్మెల్యేలు అందించిన మద్దతు లేఖను గవర్నర్ కు అందించారు.

పంజాబ్ (punjab) రాష్ట్రానికి కాబోయే సీఎం భ‌గ‌వంత్ మాన్ (Bhagwant Mann) చండీగఢ్‌ (Chandigarh) లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ (Governor Banwarilal Purohit)ను శనివారం కలిశారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవ‌స‌ర‌మైన దావా వేశారు. ఇటీవల ముగిసిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చారిత్రాత్మకమైన అధికారాన్ని సాధించిన రెండు రోజుల తర్వాత మాన్ గవర్నర్ ఆఫీసుకు చేరుకున్నారు. 

గవర్నర్‌తో భేటీ అనంతరం భ‌గ‌వంత్ మాన్ మీడియాతో మాట్లాడారు. త‌న ప్ర‌మాణ‌స్వీకార షెడ్యూల్ ను ప్ర‌క‌టించారు. ‘‘ నేను గవర్నర్‌ను కలిశాను. మా ఎమ్మెల్యేల నుంచి మద్దతు లేఖను ఆయ‌న‌కు అంద‌జేశాను. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవ‌స‌ర‌మైన ప‌త్రాల‌ను అందించాను. ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఎక్కడ చేప‌ట్టాల‌ని భావిస్తున్నామో చెప్పాల‌ని గ‌వ‌ర్న‌ర్ నన్ను అడిగారు. అయితే ఇది మార్చి 16న మధ్యాహ్నం 12.30 గంటలకు ఖట్కర్ కలాన్‌లోని భగత్ సింగ్ (Bhagat Singh) స్వగ్రామంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపాను. ’’ అని భగవంత్ మాన్ అన్నారు. 

‘‘ పంజాబ్ రాష్ట్రంలోని అనేక ఇళ్ల నుంచి ప్ర‌జ‌లు ఈ వేడుక‌కు వ‌స్తారు. వారు కూడా భగత్ సింగ్‌కు నివాళులు అర్పిస్తారు. మనకు మంచి మంత్రివర్గం ఉంటుంది, ఇంతకు ముందెన్నడూ తీసుకోని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి, మీరు వేచి ఉండాలి.’’ అని భగవంత్ మాన్ మీడియాతో తెలిపార. 

మొహాలీ (Mohali)లో శుక్రవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో భగవంత్ మాన్ ను ఆప్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 92 సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పంజాబ్ లో ఏళ్లుగా పాతుకుపోయి ఉన్న కాంగ్రెస్ (congress)ను కూక‌టి వేళ్ల‌తో ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) తొల‌గించింది. అలాగే శిరోమ‌ణి అకాళీ ద‌ల్, బీఎస్పీ, బీజేపీ వంటి పార్టీలు అక్క‌డ ప్రభావం చూప‌లేక‌పోయాయి. పంజాబ్ సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ రెండు చోట్ల నుంచి ఓడిపోయారు. కాంగ్రెస్ పంజాబ్ చీఫ్ సిద్దూ, మాజీ ముఖ్యమంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ కూడా ఓట‌మి పాల‌య్యారు. అలాగే SAD నేత ప్రకాష్ సింగ్ బాదల్ ఘోర ప‌రాజ‌యాన్ని చ‌వి చూశారు. దీంతో పాటు అనేక మంత్రి ప్ర‌ముఖులు ఆప్ ప్ర‌భంజ‌నం ముందు త‌ట్టుకోలేక‌పోయారు. 

పంజాబ్ అసెంబ్లీలో 117 సీట్లు ఉన్నాయి. ఇందులో 92 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ విజ‌యం సాధించింది. అయితే పంజాబ్ లో గ‌త 60 ఏళ్ల‌లో ఏ పార్టీకి ఇంత పెద్ద స్థాయిలో మెజారిటీ రాలేదు. 1962లో పంజాబ్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలు కైవ‌సం చేసుకుంది. త‌రువాత అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీ కూడా స్థానాలు గెలుపొంద‌లేదు. నిన్న వెల్ల‌డించిన ఫ‌లితాల్లో ఆప్ ఆ రికార్డును సొంతం చేసుకుంది. అయితే 1997లో మాత్రం బీజేపీ-అకాలీదళ్ క‌లిసి 93 స్థానాలు సాధించాయి. కానీ ఒంట‌రిగా ఒకే పార్టీకి ఇంతలా మెజారిటీ రావ‌డం 60 ఏళ్ల‌లో ఇదే తొలిసారి. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో రాష్ట్రంలోనూ అధికారం చేప‌ట్ట‌నుంది. పార్టీ స్థాపించిన అన‌తికాలంలోనే రెండో రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి ఆప్ చ‌రిత్ర సృష్టించ‌నుంది.