వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపు నుంచి ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. కాగా.. ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు అందరినీ  షాకింగ్ కి గురి చేసింది. నిన్న, మొన్నటి వరకు బీజేపీకి, ఆప్ కి అసలు పడేది కాదు. ఉప్పు నిప్పుగా మెలిగేవారు.  


అంతెందుకు మొన్నటికి మొన్న బెంగళూరులో కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ కార్యక్రమానికి కూడా విపక్షాలతో కలిసి కేజ్రీవాల్ హాజరయ్యారు. ఇంతలోనే  ఆయనలో అంత మార్పు వచ్చిందా అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  అయితే.. రాజకీయాల్లో ఇలాంటివి చాలా కామన్ అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


కాగా.. బీజేపీ కి మద్దతుగా ప్రచారం చేయడానికి కేజ్రీవాల్ కొన్ని కండిషన్స్ పెట్టడం కొసమెరపు. ‘2019 ఎన్నికలకు ముందే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా ఇచ్చి తీరాల్సిందే. అలా చేస్తే మేం వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలుకుతాం. ఫలితంగా ఢిల్లీ ప్రజలందరూ ఆ పార్టీకే ఓటేస్తారు…’ అని ఆయన సోమవారం అసెంబ్లీలో చెప్పారు. 

ఒకవేళ మోదీ ప్రభుత్వం హస్తినకు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వకపోతేమాత్రం ఎన్నికల్లో బీజేపీ నేతలను తరిమికొడతారని హెచ్చరించారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రహోదా కావాలంటూ ఆయన అసెంబ్లీలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హోదాపై మోదీ 2014లో ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని మండిపడ్డారు.