మధ్యప్రదేశ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ బోణీ కొట్టింది. రాష్ట్రంలో ఇండోర్ తర్వాత అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్ అయిన సింగ్రౌలీ మేయర్ పదవిని ఆప్ అభ్యర్ధి రాణి అగర్వాల్ సొంతం చేసుకున్నారు.
ఢిల్లీలో మొదలైన ఆప్ ప్రస్థానం (aap) ఇప్పుడు పంజాబ్‌కు విస్తరించిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సత్తా చాటాలని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) వ్యూహాలు పన్నుతున్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ ఆప్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా బీజేపీకి తామే ప్రత్యామ్నాయం కావాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లో (madhya pradesh) ఆప్ బోణీ కొట్టింది. సింగ్రౌలీ మున్సిపల్ ఎన్నికల్లో (singrauli municipal corporation) అధికార బీజేపీకి షాకిస్తూ.. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. రాణి అగర్వాల్ (rani agrawal) ఈ మేరకు విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లో ఇండోర్ తర్వాత అతిపెద్ద మున్సిపల్ కార్పోరేషన్ ఇదే. రాణి అగర్వాల్‌తో పాటు మధ్యప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్ అభ్యర్ధులకు అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలియజేశారు.
ఇక రాణి అగర్వాల్ విషయానికి వస్తే.. 2014లో ఆప్ నుంచి జిల్లా పంచాయితీ సభ్యురాలిగా గెలిచారు. 2018 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పరాజయం పాలయ్యారు. స్థానిక ఎన్నికల్లో రాణి అగర్వాల్ తరపున స్వయంగా కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించడంతో ఆమెకు కలిసొచ్చింది.
ఇకపోతే.. 2023లో పశ్చిమ బెంగాల్‌లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో (west bengal panchayat election) ఆప్ పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ఆప్ ఇంచార్జీ సంజయ్ బసు ఇప్పటికే కీలక ప్రకటన చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్రంలో క్యాంపెయిన్ ప్రారంభించామని వివరించారు.
జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ బలమైన శక్తిగా ఉన్నది. బీజేపీపై ప్రజలు విసిగెత్తే వరకు వేచి చూసి తమకు ఓట్లు వేస్తే పాలన పగ్గాలు పడతామన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ దూకుడుగా లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలూ బీజేపీని ఢీకొట్టడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమికి అంటే.. థర్డ్ ఫ్రంట్‌కు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఈ స్థానిక పార్టీల భావజాలాల ఘర్షణ, రాష్ట్రం వెలుపల లేని ఆదరణతో ఈ కూటమి రూపుదాల్చడం నెమ్మదించింది. కానీ, ఈ సవాల్‌ను ఆప్ అధిగమించింది. తొలిసారిగా మరో రాష్ట్రంలో విజయఢంకాను మోగించింది. దీంతో జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
