పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఫలితాల సరళిలో ఆప్ ముందంజలో ఉన్నది. పంజాబ్‌లో ఆప్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తే.. ఆ మార్పు కేవలం పంజాబ్‌కే పరిమితం కాబోదని, దేశ రాజకీయాలపైనా దాని ప్రభావం బలంగా ఉంటుందని అంచనాలు వస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో ఆప్ ఒక ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.  

న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకెళ్లుతున్నది. రెండు జాతీయ పార్టీలను లెక్కచేయకుండా మెజార్టీ సీట్లను కైవసం చేసుకునే దిశగా ఆప్ వెళ్లుతున్నది. తదుపరి ప్రభుత్వం ఆప్‌నే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు ఎన్నికల ఫలితాల సరళి వెల్లడిస్తున్నది. ఇదే జరిగితే.. ఆమ్ ఆద్మీ పార్టీ సిటీ(ఢిల్లీ) పార్టీగా ఉన్న పేరును తూడ్చేసుకున్నట్టే. అంతేకాదు.. ఒక ప్రాంతీయ పార్టీ మరో రాష్ట్రంలో అధికారాన్ని పొందిన తొలి పార్టీగా ఆప్ రికార్డు సృష్టించనుంది. ఇంతటితో ఆప్ విజయయాత్ర ముగియడం లేదు. గోవాలోనూ బోణీ కొట్టి ఫలితాలు రాబట్టుతున్నది. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌లో ఆప్ మెజార్టీ సీట్లు సాధిస్తే.. దాని ప్రభావం దేశ రాజకీయాలపై బలంగా పడతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పంజాబ్‌లో విజయంతో ఆప్ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తుందని, ఒక దశలో బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశాలు లేకపోలేవని వివరిస్తున్నారు.

పంజాబ్‌లో అధికారంలోని శిరోమణి అకాలీ దళ్, బీజేపీ కూటమిని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గద్దె దింపింది. అప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ 77 స్థానాలను కైవసం చేసుకున్నది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆప్ పార్టీ పోటీ చేసింది. 2013లో ఢిల్లీలో అధికారాన్ని చేపట్టి ఊపుమీదున్న ఆప్‌పై ఇతర రాష్ట్రాల్లోనూ సదభిప్రాయాలు ఏర్పడ్డాయి. దాని ఆకర్షణ దక్షిణాది కంటే.. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలపై ఎక్కువగా పడింది.

ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన 2013 నుంచి మరో రెండు సార్లు మెజార్టీ సాధించి అధికారంలోనే ఆ పార్టీ కొనసాగుతున్నది. అయితే, ఆ పార్టీ కేవలం నగర పార్టీగానే పరిమితం కావడం లేదు. ఇతర రాష్ట్రాల్లోనూ తమ సత్తా చాటాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో 2017లో పంజాబ్ అసెంబ్లీ (117 సీట్లు) ఎన్నికల్లో పోటీ చేసింది. తొలిసారి పోటీ చేసినా 20 సీట్లను కైవసం చేసుకుంది. అయితే, అప్పుడు వేర్పాటువాదులతో మిలాఖత్తు అయిందనే ఆరోపణలు రావడంతో ఆప్ వెనుకబడింది. అప్పటి శిరోమణి బీజేపీల ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది కూడా తోడై కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. కాంగ్రెస్ ఏకంగా గతంలో కంటే 31 స్థానాలను మెరుగపరుచుకుని 77 స్థానాలను గెలుచుకుంది.

ఈ ఎన్నికల్లోనూ ఆప్‌పై ‘వేర్పాటువాదుల’ ఆరోపణలు చేశారు. ఈ సారి కేజ్రీవాల్ దాన్ని అనుకూలంగా ఉపయోగించుకున్నారు. నేను విద్య వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసే స్వీట్ టెర్రరిస్టును అంటూ కౌంటర్ విసిరారు. తమ పార్టీ పారదర్శకమైందని, కేవలం ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యం అన్నట్టుగా ఆప్ తన సీఎం క్యాండిడేట్‌ ఎంపికనూ ప్రజలకే వదిలిపెట్టింది.

ఇలాంటి వ్యూహాలతో ఆప్ పార్టీ జాతీయ పార్టీగా ఎదగడానికి దారి సిద్ధం చేసుకుంది. పంజాబ్‌లో ఆప్ విజయం, కేజ్రీవాల్ సంపాదించుకున్న ఆదరణతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని అంచనాలు వేస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ బలమైన శక్తిగా ఉన్నది. బీజేపీపై ప్రజలు విసిగెత్తే వరకు వేచి చూసి తమకు ఓట్లు వేస్తే పాలన పగ్గాలు పడతామన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ దూకుడుగా లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలూ బీజేపీని ఢీకొట్టడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమికి అంటే.. థర్డ్ ఫ్రంట్‌కు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఈ స్థానిక పార్టీల భావజాలాల ఘర్షణ, రాష్ట్రం వెలుపల లేని ఆదరణతో ఈ కూటమి రూపుదాల్చడం నెమ్మదించింది. కానీ, ఈ సవాల్‌ను ఆప్ అధిగమించింది. తొలిసారిగా మరో రాష్ట్రంలో విజయఢంకాను మోగిస్తున్నది. దీంతో జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఆప్ ఎదిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. కాగా, వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌కు బదులుగా ఆప్‌ను చూసే అవకాశాలూ లేకపోలేవన్న విశ్లేషణలు వస్తున్నాయి.