ఆర్మీలో చేరాలని.. ప్రధాని కాన్వాయ్ ముందు దూకిన యువకుడు.. వారణాసిలో ఘటన
ఇండియన్ ఆర్మీలో చేరాలనే ప్రయత్నాలు విఫలమైన తరువాత ఓ యువకుడు నేరుగా ప్రధాని మోడీని కలవాలని అనుకున్నాడు. దాని కోసం ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ముందు దూకాడు. కానీ భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వారణాసిలో చోటు చేసుకుంది.

పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోడీ తన సొంత లోక్ సభ నియోజకవర్గమైన వారణాసి లో శనివారం పర్యటించారు. అయితే ఈ పర్యటనలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. ప్రధాని కాన్వాయ్ రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
‘న్యూస్ 18’ ప్రకారం.. ఘాజీపూర్ కు చెందిన కృష్ణ కుమార్ అనే యువకుడు కాన్వాయ్ ప్రయాణిస్తున్న దారిలోకి ఆకస్మాత్తుగా దూకాడు. అయితే వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు ఓ సీనియర్ బీజపీ కార్యకర్త అని, ప్రధాని మోడీని కలవాలనుకుంటున్నాడని పోలీసులు గుర్తించారు. ఆయన కొంత కాలంగా మానసికంగా కుంగిపోతున్నాడని తెలిపారు.
‘లైవ్ హిందుస్తాన్ ’ ప్రకారం.. కృష్ణ కుమార్ భారత సైన్యంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడు ఫిజికల్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించాడు. కానీ మెడికల్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు. ఈ విషయంలో ఆ యువకుడు చాలా మందికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నేరుగా ప్రధానిని కలిసి తన రిక్రూట్ మెంట్ కు సంబంధించిన విషయాలు మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణ తన వెంట ఓ ఫైల్ ను తీసుకెళ్లాడు. గంట వరకు ఎదరు చూసి ప్రధాని మోడీ కాన్వాయ్ వచ్చే ముందు ఆ దారిలో దూకాడు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. వారణాసిలో రూ.451 కోట్లతో నిర్మించనున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం శంకుస్థాపన చేశారు. భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్ సర్కార్, బీసీసీఐ చైర్మన్ రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా తదితరులు వారణాసిలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ జట్టు కస్టమైజ్డ్ 'నమో' జెర్సీని ప్రధాని మోడీకి బహూకరించారు.