గుడి దగ్గర మూత్ర విసర్జన చేయొద్దని చెప్పినందుకు.. విద్యార్థిని కారుతో ఢీకొట్టి హత్య..
ఆలయం దగ్గర మూత్ర విసర్జన చేయకూడదని చెప్పినందుకు ఓ బాలుడిపై అతడు కోపం పెంచుకున్నాడు. బాలుడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఒక రోజు బాలుడు సైకిల్ పై వెళ్తూ కనిపించడంతో కారుతో ఢీకొట్టాడు. దీంతో బాలుడు మరణించాడు.
గుడి దగ్గర మూత్రం పోయొద్దని చెప్పినందుకు ఓ విద్యార్థిపై అతడి దూరపు బంధువు కక్ష్య పెట్టుకున్నాడు. ఆ కోపంతో అతడిని కారుతో ఢీకొట్టి దారుణంగా హతమార్చాడు. అయితే ఇది మొదట రోడ్డు ప్రమాదంగా అందరూ భావించారు. కానీ అది హత్య అని పోలీసుల విచారణలో తరువాత తేలింది. ఈ ఘటన కేరళలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోని తిరువనంతపురం జిల్లా కట్టకడలో 15 ఏళ్ల ఆదిశేఖర్ అనే బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. అయితే ఆగస్టు 30వ తేదీన ఆ బాలుడు తన స్నేహితులతో ఆడుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పూవాచల్‌లోని లింకోడ్ దేవాలయం సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఎలక్ట్రిక్ కారు అతడిని ఒక్క సారిగా ఢీకొట్టింది. ఇది సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేశారు. అయితే విచారణలో భాగంగా వారు సీసీ కెమెరాలను పరిశీలించారు. అలాగే బాధిత కుటుంబ వాంగ్మూలాలు పరిశీలించిన అనంతరం నిందితుడిపై హత్యానేరం మోపారు.
అసలేం జరిగిందంటే.. ?
ఆదిశేఖర్ కు దూరపు బంధువైన 41 ఏళ్ల ప్రియరంజన్ విదేశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చారు. గత నెలలో ఒక రోజు మద్యం మత్తులో స్థానిక దేవాలయం ప్రాంగణం దగ్గర మూత్ర విసర్జన చేశాడు. దీనిని ఆదిశేఖర్ గమనించాడు. ఇదేం పని అని అతడిని నిలదీశాడు. అక్కడ మూత్ర విసర్జన చేయకూడదని చెప్పాడు. దీంతో ప్రియరంజన్ కు కోపం వచ్చింది. దీనిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు.
మంచి సమయం కోసం ఎదురుచూస్తున్న అతడికి ఆగస్టు 30వ తేదీన బాలుడు సైకిల్ పై వెళ్తూ కనిపించాడు. ఆ సమయంలో కారులో ఉన్న ప్రియరంజన్.. ఆ బాలుడిని ఢీకొట్టాడు. అనంతరం కారును బాలుడిపైకి ఎక్కించాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఈ ఘటన హత్యగా నిర్ధారించారు. అనంతరం నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కట్టకాడ పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి తెలిపారు.