యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని రద్దు చేసింది. డబ్లూఎఫ్ఐ బాడీకి ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే సభ్యత్వాన్ని తొలగిస్తామని గతంలోనే ఆ సంస్థ చెప్పింది. కానీ పలు కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. దీంతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ హెచ్చరించినట్టుగానే సభ్యత్వాన్ని తొలగించింది.

ప్రపంచ వేధికపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు ఊహించని పరిణామం ఎదురైంది. సరైన సమయంలో ఎన్నికలను నిర్వహించడంలో విఫలమైందనే కారణంతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) డబ్ల్యూఎఫ్ఐ సభ్యత్వాన్ని నిరవధికంగా నిలిపివేసింది.

గత కొంత కాలం నుంచి డబ్ల్యూఎఫ్ఐ వరుస వివాదాల్లో చిక్కుకుంది. దీంతో ఆ సంస్థకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. వాస్తవానికి భారత రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ అయిన డబ్ల్యూఎఫ్ఐకు 2023 జూన్ లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ భారత రెజ్లర్ల వరుస నిరసనలు, వివిధ రాష్ట్ర యూనిట్ల లీగల్ పిటిషన్ల కారణంగా ఎన్నికలు పదేపదే వాయిదా పడుతూ వస్తున్నాయి. 

రెజ్లింగ్ కు ప్రపంచ పాలక సంస్థ అయిన యూడబ్ల్యూడబ్ల్యూ.. భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడం వల్ల రాబోయే వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో భారత్ తరఫున ఆడేందుకు మన రెజర్లకు అవకాశం ఉండదు. దీంతో సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భారత రెజ్లర్లు 'తటస్థ అథ్లెట్స్ 'గా పోటీ పడాల్సి ఉంటుంది.

డబ్ల్యూఎఫ్ఐ గవర్నింగ్ బాడీలోని 15 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికలు జరగాల్సి ఉంది. దీని కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన సంజయ్ సింగ్ సహా నలుగురు అభ్యర్థులు సోమవారం ఢిల్లీలోని ఒలింపిక్ భవన్ లో అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శిగా చండీగఢ్ కుస్తీ సంఘానికి చెందిన దర్శన్ లాల్, కోశాధికారిగా బ్రిజ్ భూషణ్ శిబిరం నుంచి ఉత్తరాఖండ్ కు చెందిన ఎస్పీ దేశ్వాల్ నామినేట్ అయ్యారు.

డబ్ల్యూఎఫ్ఐ పనితీరుపై భారత అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన వ్యక్తం చేయడం, అప్పటి అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపించడంతో డబ్ల్యూఎఫ్ఐ బాడీని మొదట జనవరిలో, ఆ తర్వాత మేలో సస్పెండ్ చేశారు. డబ్ల్యూఎఫ్ఐ రోజువారీ వ్యవహారాలను ప్రస్తుతం భూపేందర్ సింగ్ బజ్వా నేతృత్వంలోని భారత ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసిన అడ్ హాక్ కమిటీ నిర్వహిస్తోంది. కాగా.. ఎన్నికలు ఆలస్యమైతే సస్పెండ్ చేస్తామని గతంలోనే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ డబ్ల్యూఎఫ్ఐని హెచ్చరించింది.