తొమ్మిది అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు..
మహారాష్ట్రలోని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తొమ్మిది అంతస్తుల భవనంలో సోమవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి మంటలు మొదలయ్యాయి. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు.
ముంబైలోని కందివాలి వెస్ట్ లోని మహావీర్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తొమ్మిది అంతస్తుల పవన్ ధామ్ వీణ సంతూర్ భవనంలో సోమవారం ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందటంతో వెంటనే ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
నేటి మధ్యాహ్నం 12.27 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో మంటలు మొదలు అయ్యాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమేంటనే వివరాలు ఇంకా తెలియరాలేదు.
కాగా.. గత వారం పూణే జిల్లా పింప్రి చించ్వాడ్ నగరంలోని భోసారిలోని లాండేవాడి ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న ఐస్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. వెల్డింగ్ రాడ్ నుంచి వచ్చిన స్పార్క్ కారణంగా మంటలు చెలరేగాయి.