దేశ రాజధాని ఢిల్లీలో మొదలైన అల్లర్లు  తారాస్థాయికి చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(సీఏఏ) కి మద్దతుగా కొందరు.. దానిని వ్యతిరేకిస్తూ కొందరు.. ఆందోళన చేపట్టారు. అది కాస్తా తారాస్థాయికి చేరుకొని  సామన్య పౌరుల ప్రాణాలు తీసేదాకా వచ్చింది. అంతేకాకుండా.. హిందూ, ముస్లిం అంటూ మతాలదాకా పాకింది. చాలా మంది మసీదుని కూడా కాల్చేశారు.

ఇలాంటి అల్లర్ల మధ్య ఓ జంట పెద్ద సాహసం చేసింది. ఓ హిందూ యువతి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. అది కూడా పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. వీరి పెళ్లికి అల్లరి మూకలు ఎలాంటి ఆటకం కలిగించకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ఇరుగుపొరుగు వారైన ఈ రెండు కుటుంబాలకు ఎన్నో సంవత్సరాలుగా సన్నిహిత్యం ఉంది.

ఆ స్నేహానికి బంధుత్వంగా మార్చుకోవాలని రెండు కుటుంబాలు అనుకున్నాయి. ఈ క్రమంలోనే తమ కూతురిని ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లిచేశామని యువతి తండ్రి మీడియాతో చెప్పారు. వధువు సావిత్రి ప్రసాద్ మాట్లాడుతూ.. తన పెళ్లిల్లో ఎలాంటి ఆటకం కలగకుండా ముస్లిం సోదరులు తమకు రక్షణగా నిలిచారని ఆమె పేర్కొన్నారు. 

Also Read ఢిల్లీ అల్లర్లు.. నిండు గర్భిణీపై దాడి.. మిరాకిల్ అంటున్న డాక్టర్లు...

ముస్లిం ఆందోళనకారుల నుంచి పెళ్లికొడుకు వాళ్లు.. హిందూ ఆందోళనకారుల నుంచి పెళ్లికూతురి తరపు వాళ్లు ఎటువంటి ఆందోళనలు జరగకుండా కాపాడుకుంటూ పెళ్లి తంతును పూర్తి చేశారు. పెద్ద ఎత్తులో జరగాల్సిన సంబరాలను మోతాదు తగ్గించి మామూలుగా పూర్తి చేశారు. ఈ అల్లర్ల కారణంగా తమ పెళ్లికి బంధువులు చాలా తక్కువ మంది హాజరయ్యారని వారు విచారం వ్యక్తం చేశారు.

ముస్లిం, హిందూ కాదు.. అన్నింటికన్నా ముందు మనమంతా మనుషులమంటూ పెళ్లి కూతురి సోదరి పేర్కొనడం గమనార్హం. తమకు ఎలాంటి వివాదాలు అవసరం లేదని.. కేవలం శాంతి మాత్రమేకోరుకుంటామని వారు చెప్పడం విశేషం.