Gujarat: గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ తరపున ప్రచారం ప్రారంభించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలుమార్లు ఆయన గుజరాత్ పర్యటనలు చేశారు. అయితే, ఎన్నికల సంఘం (ఈసీ) ఎన్నికల ప్రకటన తర్వాత ఇది ప్రధాని మోడీకి మొదటి ఎన్నికల ప్రచార కార్యక్రమం.
Gujarat Assembly Elections: ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 6 ఆదివారం నాడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వల్సాద్‌లో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఆదివాసీ కమ్యూనిటీ ఆశీర్వాదాలతో తన ప్రచారాన్ని ప్రారంభించినందుకు గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. గుజరాత్ లో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. “ప్రజలు అన్ని రికార్డులను బద్దలు కొట్టి బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్ ప్రజలకు అవసరమైనంత సమయం ఇస్తాను. ఈసారి నా రికార్డును నేనే బ్రేక్ చేస్తాను' అని ప్రధాని అన్నారు. “భూపేంద్ర రికార్డులు నరేంద్ర రికార్డుల కంటే బలంగా ఉండాలి. నేను దాని కోసం పని చేయాలనుకుంటున్నాను” అని ప్రధాని అన్నారు.
సామాజిక సేవ అనేది గుజరాత్ సంప్రదాయం, సంస్కృతి అని ఆయన అన్నారు. “రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి గుజరాత్‌లోని ఆదివాసీలు, ఇతర వర్గాలు చేయి చేయి కలిపి నడవాల్సిన అవసరం ఉంది. గుజరాత్ అభివృద్ధి స్ఫూర్తితో దేశాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాం. నేను ఢిల్లీలో కూర్చోవచ్చు కానీ నేను గుజరాత్ నుండి ప్రతిదీ నేర్చుకున్నాను. నా తర్వాత సీఎంల పని చూడండి. గుజరాత్ ప్రజలకు సేవలు అందించేందుకు నిత్యం కృషి చేస్తున్నారు అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అలాగే, "ఎ అంటే ఆదివాసీలు.. నా ఎన్నికల తొలి సమావేశం నా ఆదివాసీ సోదర సోదరీమణుల ఆశీస్సులతో ప్రారంభం కావడం నా అదృష్టం. ఒకప్పుడు వైద్యుల కోసం వేట సాగించాం. ఈ రోజుల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో ఆసుపత్రులు, వైద్య కళాశాలలు వచ్చాయని" ప్రధాని అన్నారు.
ఇదిలావుండగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం అనేక ప్రత్యేక సన్నాహాలు చేసింది. వీటిలో ముఖ్యమైనది బ్యాంకు లావాదేవీలపై నిఘా ఉంచడం. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. లక్ష రూపాయలకు మించి లావాదేవీలు జరిగితే పోటీలో ఉన్న అభ్యర్థుల ఖాతాలను తెలియజేయాలని బ్యాంకులను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, అభ్యర్థులు ప్రచార సమయంలో రూ. 40 లక్షలకు మించి ఖర్చు చేయరాదని, అందుకోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుందని రాష్ట్ర సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. రూ.10,000 కంటే ఎక్కువ లావాదేవీలన్నీ చెక్కు, ఆర్‌టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్) లేదా డ్రాఫ్ట్ ద్వారానే జరగాల్సి ఉంటుందని చెప్పారు.
