ఓ కారు వేగంగా ఢీకొట్టడంతో పాదచారి మురుగు నీటి కాలువలో పడి మరణించాడు. ఈ ఘటన కర్ణాటకలోని నేలమంగళ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఓ పాదచారిని కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో అతడు మురుగు నీటి కాలువలో పడిపోయాడు. తీవ్ర గాయాలతో అందులోనే చనిపోయాడు. ఈ ఘటన తెల్లవారుజామున జరగడంతో ఎవరూ గమనించలేదు. కారు నడిపిన వ్యక్తి కనీసం ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 36 గంటల తరువాత నాలా నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు డెడ్ బాడీని గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. కర్ణాటకలోని నేలమంగళ పట్టణంలోని దనోజిపాళ్య వద్ద పొదలతో నిండిన మురుగు కాల్వలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న 32 ఏళ్ల వ్యక్తి మృతదేహం ఆగస్టు 5వ తేదీన లభించింది. అయితే అతడు చనిపోయి అప్పటికే 36 గంటలు అవుతోందని పోలీసులు గుర్తించారు. మొదట ఇది హత్య అని, అతడిని ఎవరో కావాలనే చంపారని కుటుంబ సభ్యలు ఆరోపించారు. కానీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అది హత్య కాదని, కారు ప్రమాదంలో మరణించాడని తేల్చారు.
నేలమంగళ టౌన్ పోలీసులు మృతుడిని దొడ్డబళ్లాపూర్ కు చెందిన 32 సంతోష్ కుమార్ గా గుర్తించారు. ఆగస్టు 4వ తేదీన తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు తేల్చారు. గాయాలైన వెంటనే అతడిని రక్షించి, చికిత్స అందించి ఉంటే బతికేవాడని చెప్పారు. ఈ ప్రమాదంపై దర్యాప్తులో భాగంగా నేలమంగళ టౌన్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులను సంప్రదించారు. అయితే ఓ ఆటో డ్రైవర్ ఫిర్యాదు ప్రకారం ఓ షిఫ్ట్ కారు ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో బెంగళూరులోని విజయనగర్ కు చెందిన ఎస్ ప్రదీప్ కుమార్ అనే ఆటో డ్రైవర్ తన స్నేహితులు దేవరాజు, శరణ బసప్పతో కలిసి నేలమంగళకు వెళ్తున్నారు. అయితే దనోజీపాళ్యం వద్ద బ్రిడ్జి వద్దకు రాగానే వేగంగా వచ్చిన స్విఫ్ట్ కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురికి గాయాలు అయ్యాయి.
కొంత సమయం తరువాత కారు కూడా వెళ్లి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ముగ్గురికి కూడా గాయాలు అయ్యాయి. అటుగా వెళ్తున్న వారు ఆంబులెన్స్ కు సమాచారం అందించారు. ఆ వాహనంలో క్షతగాత్రులందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా.. కారు వేగంగా, నిర్లక్ష్యంగా నడిపినందుకు 27 ఏళ్ల డ్రైవర్ మంజునాథపై పోలీసులు కేసు నమోదు చేశారు.
