Mangalore: 70 ఏళ్ల కర్ణాటక మహిళ క్విక్ థింకింగ్  పెద్ద రైలు ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడింది. పట్టాలపై చెట్టు పడటాన్ని గమనించిన చంద్రావతి ఆ సమాచారాన్ని ఎవరికైనా తెలియజేయడానికి ఇంటికి పరుగెత్తానని తాను చేసిన ప‌నిని గురించి చెప్పారు. 

70-Year-Old Karnataka Woman Chandravathi: కర్నాట‌క‌కు చెందిన 70 ఏళ్ల మ‌హిళ చేసిన ఒక ప‌ని పెద్ద రైలు ప్ర‌మాదాన్ని ఆపింది. ఆమె చేసిన ప‌నిని ఇప్పుడు అంద‌రూ మెచ్చుకుంటున్నారు. రైల్వే శాఖ సైతం ఆమెను అభినిందించింది. దీనిని సంబంధించి అంశం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.. అంత‌లా ఆ మ‌హిళ ఏం చేసింది..? ఎలా పెద్ద రైలు ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా నివారించింది.. ! 

మంగళూరులోని మందరకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ఇటీవల కర్ణాటకలో ఒక రైలు ప్రమాదాన్ని నివారించడంలో తన తెలివితేటలతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. మార్చి 21న మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ఇంటి బయట ఉన్న చంద్రావతి అనే మహిళ పడిల్-జోకటే మధ్య ఉన్న రైల్వే ట్రాక్స్ పై ఒక పెద్ద చెట్టు పడటాన్ని గమనించింది. మంగళూరు నుంచి ముంబై వెళ్లే మత్స్యగంధ ఎక్స్ ప్రెస్ ఆ మార్గంలో వెళ్తుందని తెలిసిన చంద్రావతి.. జ‌ర‌గ‌బోయే ఘోర ప్ర‌మాదాన్ని ఆప‌ల‌ని నిర్ణ‌యించుకుంది. వెంట‌నే తన ఇంట్లోకి వెళ్లి ఎర్రటి గుడ్డను బయటకు తీసి ఎదురుగా వస్తున్న రైలు లోకో పైలట్ కు చూపుతూ ఊపింది.

ఇది గమనించిన లోకో పైలట్ ప్రమాదాన్ని గ్రహించి ట్రాక్ పై చెట్టు పడిన ప్రదేశానికి సమీపంలో ఆగిన రైలును నెమ్మదిగా నడిపాడు. అనంతరం రైల్వే సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకుని ట్రాక్ పై ఉన్న చెట్టును తొలగించారు. ఇలా పెను ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా ప‌నిచేసిన ఆ మ‌హిళ‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఈ క్ర‌మంలోనే సీనియర్ అధికారులు హాజరైన కార్యక్రమంలో మంగళవారం ఆ వృద్ధురాలిని రైల్వే పోలీసులు సన్మానించారు. ఈ సంఘటనను గుర్తుచేసుకున్న చంద్రావతి విలేకరులతో మాట్లాడుతూ చెట్టు పట్టాలపై పడటాన్ని గమనించిన వెంటనే ఆ సమాచారాన్ని ఎవరికైనా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంటికి పరుగెత్తానని చెప్పారు.

ఆ సమయానికి రైలు హారన్ శబ్దం విని వృథా చేసే సమయం లేదని గ్రహించి ఎర్రటి గుడ్డతో బయటకు పరుగెత్తింది. ఆమె ట్రాక్ వైపు పరిగెత్తి గుడ్డను ఊపింది. ట్రాక్ వైపు పరిగెత్తేటప్పుడు ఇటీవల తాను చేయించుకున్న గుండె శస్త్రచికిత్స గురించి ఆలోచించే సమయం కూడా లేదని చంద్రావతి చెప్పారు.