మహారాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఒక్కడే తన ఇంటి సమీపంలో బావి తవ్వాడు. తన తల్లి రోజూ నీటి కోసం పడుతున్న కష్టాలను చూసిన బాలుడు ఈ పనికి పూనుకున్నాడు. బాలుడిని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అభినందిస్తున్నారు.
ఇంటి అవసరాల కోసం నీటిని తీసుకురావడానికి తన తల్లి పడుతున్న కష్టాలు చూసిన ఆ కుమారుడు తల్లడిల్లిపోయాడు. ప్రతీ రోజు ఎండలో నడుచుకుంటూ నదిలోకి వెళ్లి నీళ్లు తేవడం తట్టుకోలేకపోయాడు. తల్లి కష్టాన్ని తగ్గించాలని అనుకున్నాడు. దీని కోసం తన ఇంటి వద్దనే బావి తవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా బావి తవ్వడం మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేశాడు. దీంతో ఆ తల్లి నీటి కష్టాలు తీరిపోయాయి.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన 9వ తరగతి చదువుతున్న బాలుడు చేసిన పని ఇప్పుడు అందరితో ప్రశంసలు అందుకుంటోంది. ఆ పిల్లాడు తన తల్లి కోసం ఏకంగా బావినే తవ్వాడు. కెల్వే గ్రామంలోని ప్రణవ్ రమేష్ అనే 14 ఏళ్ల బాలుడు స్థానికంగా ఉండే ఆదర్శ విద్యా మందిర్ లో చదువుతున్నాడు. ఆ బాలుడు తన తండ్రి వినాయక్, తల్లి దర్శనతో కలిసి తన గ్రామంలో ఓ గుడిసెలో నివసిస్తున్నాడు.
ఈ కుటుంబం మొత్తం నీటి అవసరాల కోసం స్థానికంగా ఉన్న ఓ నదిపై ఆధారపడేది. తల్లి దర్శన ప్రతీ రోజు నది వద్దకు నడుచుకుంటూ వెళ్లి బిందెల సాయంతో నీటిని తీసుకొచ్చేది. ఇది ప్రతీ రోజూ జరుగుతుండేది. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఎండలు ఎక్కువగా మండుతున్నాయి. ఇప్పుడు కూడా ప్రతీ రోజు ఆదర్శ ఎండలో నడుచుకుంటూ వెళ్లి నీటిని తీసుకొచ్చేది. తల్లి కష్టాన్ని చూసి ప్రణవ్ రమేష్ చలించిపోయాడు. వెంటనే అమ్మ కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు.
వెంటనే తమ గుడిసెకు సమీపంలోని ఖాళీ ప్రదేశంలో బావి తవ్వడం ప్రారంభించాడు. కొన్ని రోజుల్లో వ్యవధిలోనే ఆ బావిని తవ్వడం పూర్తి చేశాడు. ఆ బావిలోకి నీళ్లు రావడంతో ఆ కుటుంబం మొత్తం సంతోషపడింది. దీంతో ఆ తల్లికి ఇక నది వద్దకు నడిచి వెళ్లే బాధ తప్పింది. ఇంటికి అవసమయ్యే నీళ్లు మొత్తం ఆ బావిలో నుంచే తీసుకుంటున్నారు. ఈ వార్త స్థానిక గ్రామాల ప్రజలకు తెలియడంతో వారంతా ఆ బావిని, బాలుడిని చూసేందుకు వస్తున్నారు.
‘‘మా ఆయ్ (మరాటీలో అమ్మ అని అర్థం) దగ్గరలోని నదిలో నుంచి ప్రతీ రోజు నడిచి వెళ్తూ నీళ్లు తీసుకురావడం నాకు నచ్చలేదు. ప్రతిరోజూ ఉదయం వంట, ఇతర పనుల కోసం నీటిని తీసుకొచ్చేది. అందుకే నేను ఇంటి దగ్గరే బావిని తవ్వాను. ఇకపై ఆయ్ నీళ్ల కోసం నదికి వెళ్లాల్సిన అవసరం రాకపోవడం సంతోషంగా అనిపిస్తోంది’’ అని ఆ బాలుడు వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు.
‘‘నా కొడుకు బావి తవ్వడం మొదలుపెట్టాడు. పైన ఉన్న పెద్ద పెద్ద రాళ్లను తీసేందుకు మాత్రమే నేను సాయం చేశాను. మిగితా బావి అంతా నా కుమారుడే పూర్తి చేశాడు. రోజూ కేవలం 15 నిమిషాల భోజన విరామం మాత్రమే తీసుకునేవాడు. మిగిలిన సమయం అంతా బావిని తవ్వేందుకే ఉపయోగించేవాడు.’’ అని తండ్రి రమేష్ తెలిపారు. బావి తవ్వడం పూర్తయిన తరువాత స్వచ్ఛమైన నీరు భూమి నుంచి బయటకు దూసుకురావడంతో తన కుమారుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ట్యూషన్ క్లాసులు చెప్పేందుకు ఆర్థిక సాయం చేస్తానని టీచర్ పై అత్యాచారం.. అసహజ శృంగారం..
ఇంటికి నీళ్లు తీసుకురావడానికి ప్రతిరోజూ ఎండలో నడవాల్సిన అవసరం లేకపోవడంతో తనకు ఉపశమనం లభించిందని ప్రణవ్ తల్లి దర్శన తెలిపారు. ఇంటి వద్దనే బావి ఉండటంతో ఇప్పుడు చాలా సౌకర్యంగా ఉందని చెప్పారు.