Asianet News TeluguAsianet News Telugu

అపూర్వ కలయిక : భారత్-పాక్ విభజనలో తప్పిపోయి.. 75 యేళ్ల తరువాత కలుసుకున్నారు..

పంజాబ్‌లో ఓ అపురూప ఘటన చోటు చేసుకుంది. జలంధర్‌కు చెందిన 92 ఏళ్ల వ్యక్తి 75 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు చెందిన తన సోదరుడి కొడుకును కలిశాడు. ఈ ఘటన గురుద్వారా కర్తార్‌పూర్ సాహిబ్‌లో చోటు చేసుకుంది.

92-year-old Indian man reunites with Pak-based nephew after 75 years
Author
Hyderabad, First Published Aug 9, 2022, 11:05 AM IST

పంజాబ్ : భారత్ లోని పంజాబ్‌కు చెందిన 92 ఏళ్ల వ్యక్తి 75 యేళ్ల తరువాత పాకిస్తాన్ నుండి వచ్చిన తన సోదరుడి కొడుకును కలుసుకున్నారు. ఈ ఘటనకు చారిత్రాత్మక గురుద్వారా కర్తార్‌పూర్ సాహిబ్‌ వేదికగా మారింది. సోమవారంనాడు ఈ అపురూప కలయిక జరిగింది. ఇండియా-పాక్ విభజన సమయంలో వీరిద్దరూ విడిపోయారు. ఆ సమయంలో జరిగిన మతపరమైన ఘర్షణల్లో వీరి బంధువులు చాలామంది చనిపోయారు. విడిపోయిన  75 సంవత్సరాల తరువాత  వీరిద్దరూ కలుసుకున్నారు. ఈ రీయూనియన్ లో వీరిద్దరి బంధువులు కూడా పాల్గొన్నారు.

శర్వాన్ సింగ్ అనే 92యేళ్ల వృద్ధుడు.. తన సోదరుడి కుమారుడైన మోహన్ సింగ్ ను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. మోహన్ సింగ్ ఇప్పుడు అబ్దుల్ ఖలిక్ గా మారిపోయాడు. అతడిని పాకిస్తాన్ లోని ఓ ముస్లిం కుటుంబం పెంచింది. ఈ సందర్భంగా ఖలీక్ తన పెదనాన్న కాళ్లు మొక్కారు. చాలా సేపటి వరకు కౌగిలించుకుని అలాగే ఉండిపోయారు... అని ఖలీక్ బంధువు ముహమ్మద్ నయీమ్ కర్తార్‌పూర్ కారిడార్ నుంచి ఫోన్‌లో PTI కి చెప్పారు. వారిద్దరూ కలిసి నాలుగు గంటల పాటు గడిపారని, తమ తమ దేశాల్లోని జ్ఞాపకాలను, జీవన విధానాలను పంచుకున్నారని ఆయన చెప్పారు.

బ్యాంకు మేనేజ‌ర్ పై యాసిడ్ దాడి.. రంగంలోకి దిగిన పోలీసులు.. !

రీ యూనియన్ సమయంలో సింగ్, ఖలీక్ ఇద్దరూ తెల్లటి కుర్తా పైజామా ధరించారు, ఒకరు నల్లటి తలపాగా, రెండోవారు తెల్లటి తలపాగా ధరించారు. వారు కలుసుకున్న సమయంలో బంధువులు వారిమీద గులాబీ రేకులు చల్లారు. వారిద్దరికీ పూలమాలలు వేశారు. ఇన్నేళ్ల తరువాత కలుసుకోవడం మా భావోద్వేగాలను మాటల్లో చెప్పలేకపోతున్నామన్నారు.

ఇంతకీ ఎలా కలిశారంటే?
75 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలుసుకునేలా చేయడంలో భారత్, పాకిస్థాన్‌ లకు చెందిన ఇద్దరు యూట్యూబర్‌లు పాత్ర పోషించారు. విభజన సమయంలో, పాకిస్తాన్‌లోని ముస్లిం కుటుంబంలో పెరిగిన ఖాలిక్ కు అప్పుడు  ఆరేళ్ల వయసని భారత్ లో జలంధర్‌కు చెందిన పర్వీందర్ చెప్పారు. జండియాలాకు చెందిన యూట్యూబర్ విభజనకు సంబంధించిన అనేక కథనాలను డాక్యుమెంట్ చేశాడు. ఈ క్రమంలోనే కొన్ని నెలల క్రితం అతను శర్వాన్‌ను కలిసి.. అతని జీవిత కథను డాక్యుమెంట్ చేశాడు. దాన్ని YouTube ఛానెల్‌లో పోస్ట్ చేశాడు. అదే సమయంలో సరిహద్దులో, ఒక పాకిస్తానీ యూట్యూబర్ విభజన సమయంలో తన కుటుంబం నుండి విడిపోయిన ఖలిక్ కథను పోస్ట్ చేశాడు.

అయితే, యాదృచ్ఛికంగా, ఆస్ట్రేలియాలో ఉన్న పంజాబ్‌కు చెందిన వ్యక్తి ఈ రెండు వీడియోలను చూశాడు. వాటిని తమ బంధువులకు చూపించాడు. తమ కుటుంబానికి కనెక్ట్ అవుతుందనిపించింది. ఒక వీడియోలో, శర్వాన్ తప్పిపోయిన తన సోదరుడి కొడుకు గుర్తులను చెప్పాడు.  అతడికి రెండు బొటనవేళ్లు, అతని తొడమీద ఉన్న పుట్టుమచ్చ గురించి చెప్పాడు. మరోవైపు, పాకిస్థానీ యూట్యూబర్ పోస్ట్ చేసిన వీడియోలో ఖలిక్ గురించి ఇలాంటి ఆనవాళ్లే ఉన్నాయి. దీంతో ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి వీరిద్దరినీ కాంటాక్ట్ చేశాడు. 

తాత చెప్పిన ఆనవాళ్లతో ఖలిక్‌ను గుర్తించాడని పర్వీందర్ తెలిపారు. శర్వాన్ కుటుంబం అప్పుడు పాకిస్తాన్‌లోని చక్ 37 గ్రామంలో నివసించేది. విభజన సమయంలో మత హింసలో అతని కుటుంబానికి చెందిన 22 మంది మరణించారు. ఆ సమయంలో శర్వాన్ తో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులు భారత్ చేరుకున్నారు. ఈ హింసాకాండలో తప్పిపోయిన ఖలిక్, తరువాత పాకిస్తాన్‌లోని ఒక ముస్లిం కుటుంబానికి దొరికాడు. ప్రస్తుతం తన కొడుకుతో కెనడాలో నివసిస్తున్న శర్వాన్, COVID-19 బారిన పడినప్పటి నుండి జలంధర్ సమీపంలోని సంధ్మాన్ గ్రామంలో తన కుమార్తె ఇంటి వద్ద ఉంటున్నాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios