Haryana: లంచం తీసుకున్నందుకు గానూ 83 మంది ప్రభుత్వ అధికారులను హర్యానా విజిలెన్స్ అరెస్టు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు ఈ అరెస్టులు కొనసాగాయి. ప్రయివేటు వ్యక్తులతో కలుపుకుంటే ఈ సంఖ్య 91కి చేరుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Haryana Vigilance Bureau: అక్రమాలు, లంచాలను అరికట్టడానికి ఇప్పటికే దేశంలోని ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువచ్చినా.. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో ఇది యధేచ్చగా కొనసాగుతూనే ఉంది. లంచ ఇస్తేనే పనిజరుగుతుందనేది బహిరంగ రహస్యం. అయితే, ఇటీవల హర్యానాలో లంచం సంబంధిత వేధింపులు ప్రభుత్వ అధికారులు నుంచి పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ఈ క్రమంలోనే లంచం తీసుకున్నందుకు గానూ 83 మంది ప్రభుత్వ అధికారులను హర్యానా విజిలెన్స్ అరెస్టు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు ఈ అరెస్టులు కొనసాగాయి. ప్రయివేటు వ్యక్తులతో కలుపుకుంటే ఈ సంఖ్య 91కి చేరుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ 83 మంది ప్రభుత్వ అధికారులతో 10 మంది గెజిటెడ్ అధికారులు కూడా ఉన్నారు. అరెస్టయిన వారిలో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు 18 మంది ఉన్నారు. అలాగే, పోలీసు శాఖకు చెందిన సిబ్బంది 23 మంది, విద్యుత్ శాఖకు చెందిన 15 మంది, పట్టణ స్థానిక సంస్థలకు చెందిన 8 మంది, ఎక్సైజ్, పన్నుల శాఖకు చెందిన ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు ఉన్నారు.
హిందుస్థాన్ టైమ్స్‌లో వచ్చిన కథనం ప్రకారం నిందితులు వేర్వేరు కేసుల్లో రూ.5,000 నుండి రూ.5 లక్షల వరకు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హర్యానాలోని కర్నాల్‌లోని మహిళా పోలీసు అధికారి ఎఫ్‌ఐఆర్ నుండి రేప్ కేసును తొలగించడానికి రూ.4 లక్షలు లంచం తీసుకుంటున్న క్రమంలో అరెస్టు చేశారు. పట్టణ స్థానిక సంస్థల విభాగానికి చెందిన ఇద్దరు చీఫ్ ఇంజనీర్లను ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు అరెస్టు చేయగా, హర్యానా సివిల్ సర్వీస్ (హెచ్‌సిఎస్) అధికారిని ట్రాప్ కేసు దర్యాప్తు సందర్భంగా అరెస్టు చేసినట్లు హర్యానా విజిలెన్స్ బ్యూరో ప్రతినిధిని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.
5 లక్షలు లంచం తీసుకున్న జిల్లా టౌన్ ప్లానర్‌ను విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది. అతనితో పాటు సహ నిందితుడైన తహసీల్దార్‌ను కూడా అరెస్టు చేశారు. 50,000 రూపాయల లంచం తీసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను కూడా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యూరో డిప్యూటీ ఎక్సైజ్ మరియు టాక్సేషన్ కమిషనర్‌ను కూడా అరెస్టు చేసింది. ఆయన 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు లంచాలను డిమాండ్ చేయడం ఇటీవలి కాలంలో పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీని కోసం లంచం ఫిర్యాదులను దాఖలు చేయడానికి హర్యానా విజిలెన్స్ బ్యూరో టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1800-180-2022, 1064ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
హర్యానా స్టేట్ విజిలెన్స్ బ్యూరో కు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. "అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడం వల్ల జనవరి నుండి జూన్ 30 వరకు 10 మంది గెజిటెడ్ అధికారులు, మరో 73 మంది నాన్ గెజిటెడ్ అధికారులను అరెస్టు చేశారు. సగటున ప్రతి నెలా 15 మంది ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారు” అని వెల్లడించారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులకు సంబంధించి ప్రభుత్వ, ప్రయివేటు వ్యక్తుల మొత్తం అరెస్టులు 91కి చేరుకున్నాయని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా విజిలెన్స్ బ్యూరో డ్రైవ్‌ను తీవ్రతరం చేయడానికి కట్టుబడి ఉండటంతో... మరిన్ని అరెస్టు లు కొనసాగుతాయని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనీ, తాము తీసుకువచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని విజిలెన్స్ బ్యూరో ప్రజలను కోరింది.
