సూరత్: గుజరాత్ రాష్ట్రంలో జరిగిన ఓ హత్యకు సంబంధించిన రహస్యం విచిత్రంగా బయటపడింది. గుజరాత్ లోని సూరత్ లో భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవ విపరీత పరిణామానికి దారి తీసింది. భార్యతో గొడవ పడిన వ్యక్తి ఆమెను హత్య చేశాడు. గొడవలో ఆమె గొంతు నులిమి చంపేశాడు. 

ఆ హత్య జరిగిన సమయంలో వారి ఎనిమిదేళ్ల వయస్సు గల కుమారుడు అక్కడే ఉన్నాడు. దాన్ని పట్టించుకోకుండా ఆమె ఆత్మహత్య చేసుకుందని అతను నాటకమాడాడు. రసిక్ భాయ్ అనే వ్యక్తి భార్య హంసను చంపేశాడు. దాన్ని వారి ఎనిమిదేళ్ల కుమారుడు తనయ్ చూశాడు. 

భార్యను చంపేసి మృతదేహాన్ని రసిక్ ఇంట్లో వేలాడదీశాడు. ఈ సమాచారం పోలీసులకు అందింది. దాంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని హంస మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. రసిక్ ను పోలీసులు విచారించారు. ఆ సమయంలో తండ్రే హత్య చేశాడని ఎనిమిదేళ్ల బాలుడు పోలీసులకు చెప్పాడు. 

పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో రసిక్ తన నేరాన్ని అంగీకరిచాడు. పోలీసులు రసిక్ ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.