హర్యానాలోని జింద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జింద్-భివానీ రహదారిపై బీబీపూర్ గ్రామ సమీపంలో భివానీ డిపోకు చెందిన బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు.
హర్యానాలోని జింద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జింద్-భివానీ రహదారిపై బీబీపూర్ గ్రామ సమీపంలో భివానీ డిపోకు చెందిన బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా.. పలువురు గాయపడినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక, ఈ ప్రమాదంలో మరణించినవారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. గాయపడిన వారిలో ఆరుగురిని రోహ్‌తక్‌లోని పీజీఐఎంఎస్ ఆసుపత్రికి తరలించగా.. ఇద్దరు జింద్‌లో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే డీఎస్పీ రోహతాష్ ధుల్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక, ఈ ప్రమాదంపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జింద్‌లోని భివానీ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మరణించారనే వార్త చాలా బాధాకలిగించిందని పేర్కొన్నారు. భగవంతుడు మృతుల ఆత్మకు శాంతి చేకూర్చాలని.. మృతుల కుటుంబ సభ్యులకు ఆ నష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలను కోరారు.
