పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసుతో ప్రమేయమున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇవాళ సిద్ధూ కుటుంబాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈ సందర్భంగా పంజాబ్ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు గుప్పించారు.
పంజాబీ సింగర్, కాంగ్రెస్ (congress) నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసుకు (sidhu moose wala) సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధూను హత్య చేసిన నిందితుల రవాణా , వాహనాలను సమకూర్చడం, రెక్కి, నిందితులకు ఆశ్రయం కల్పించడం వంటి అభియోగాలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. వీరిలో నలుగురు షూటర్లు కూడా వున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. అరెస్ట్ చేసిన వారిని హర్యానాలోని సిర్సాకు చెందిన సందీప్ సింగ్ అలియాస్ కేక్డా, మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్నా, మన్‌ప్రీత్ భౌ, సరాజ్ మింటూ, ప్రభదీప్ సిద్ధూ అలియాస్ పబ్బి, మోను దాగర్, పవన్ బిష్ణోయ్, నసీబ్‌లుగా గుర్తించారు.
కాగా.. మే 29వ తేదీన తన మిత్రులతో కలిసి స్వగ్రామానికి చేరుకుంటున్న సిద్ధూ మూసేవాలాను వెంబడించిన దుండగులు.. జవహర్‌కే గ్రామం వద్ద ఆయన కారుకు వాహనాలు అడ్డుపెట్టారు. అనంతరం అసాల్ట్ రైఫిల్‌తో మూసేవాలాపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డ్రైవింగ్ సీట్లో వున్న సిద్ధూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆయన మిత్రులు గాయాలతో బయటపడ్డారు. పంజాబ్‌లో వీఐపీలకు భద్రత ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ ఘటన జరగడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Also Read:sidhu moose wala: సిద్ధూ తల్లిదండ్రులను పరామర్శించిన అమిత్ షా.. కన్నీటిపర్యంతమైన మూసేవాలా తండ్రి
ఇకపోతే.. సిద్ధూ మూస్ వాలాను తామే హత్య చేసినట్లు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ (lawrence bishnoi) అంగీకరించిన సంగతి తెలిసిందే. అతనితో తమకు శతృత్వం వుందని ఈ క్రమంలోనే కెనడాకు చెందిన గోల్డీ బ్రార్ (goldy brar) అనే మరో గ్యాంగ్‌స్టర్ సాయంతో హత్య చేయించినట్లు లారెన్స్ చెప్పారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలక ఆధారాలు లభ్యం అయినట్టు తెలుస్తోంది. ఓ పెట్రోల్ బంక్ లో ఇద్దరు అనుమానితులకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు సేకరించారు. ఫతేహాబాద్ ప్రాంతంలో ఈ పెట్రోల్ బంక్ ఉంది.
ఈ ఫుటేజీలో కనిపించిన కారు సిద్ధూ మూస్ వాలా హత్యకు ఉపయోగించిన కారు అని పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో కారు నడుపుతున్న వ్యక్తి జాంటీ అనే గ్యాంగ్ స్టర్ గా, మరో నిందితుడిని పర్వత్ ఫౌజీగా గుర్తించారు. ఇద్దరు అనుమానితులు ఫ్యూయల్ నింపేందుకు ఆ కారు నుంచి దిగారు. ఆ సమయంలో వారి ఫేస్ లు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. జాంటీ, ఫౌజీ ఇద్దరూ సోనిపట్ కు చెందిన గ్యాంగ్ స్టర్లు కావడంతో హర్యానాలోని గ్యాంగ్ స్టర్ నెక్సస్, సిద్ధూ మూస్ వాలా హత్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఈ ఫుటేజ్ లో కనిపించిన వారి జాడ కోసం గాలిస్తున్నారు.