విభజన సమయంలో ఎవరైతే అమానవీయ పరిస్థితులను ఎదుర్కొన్నారో, అత్యాచారాలకు గురయ్యారో, కనీసం చనిపోయిన తరువాత ఖర్మకాండలకు కూడా నోచుకోలేదో... వారందరూ మన స్మృతుల్లో జీవించి ఉండడం అత్యవసరమని ప్రధాని పేర్కొన్నారు. 

భారత 75వ స్వతంత్ర దినోత్సవం నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ... ఎర్రకోటపై ఉదయం 7.30కు జాతీయ జెండాను ఎగురవేసి భారతీయులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ... విభజన సమయంలో ప్రజలు వర్ణనాతీతమైన బాధలకు గురయ్యారని, వాటన్నిటినీ మనం స్వతంత్రం వచ్చిన వెంటనే మర్చిపోయే ప్రయత్నం చేశామని... కానీ వారందర్ని మన స్మృతుల్లో జీవింపజేసి ఉండడం అవసరమని ప్రధాని మోడీ అన్నారు. 

అందుకే నిన్న ఆగస్టు 14ను విభజన భయోత్పాత స్మృతి దినంగా పాటించాలని దేశం నిర్ణయించిందని అన్నారు ప్రధాని మోడీ. విభజన సమయంలో ఎవరైతే అమానవీయ పరిస్థితులను ఎదుర్కొన్నారో, అత్యాచారాలకు గురయ్యారో, కనీసం చనిపోయిన తరువాత ఖర్మకాండలకు కూడా నోచుకోలేదో... వారందరూ మన స్మృతుల్లో జీవించి ఉండడం అత్యవసరమని ప్రధాని పేర్కొన్నారు. వారందరికీ శ్రద్ధాంజలి ఘటించారు ప్రధాని మోడీ. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలోనే దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఈ ఏడాదిలో జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం వేడుకల్లో సరికొత్త ఉత్తేజం వెల్లివిరుస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Scroll to load tweet…

ఉదయం రాజ్ ఘాట్ లో మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించి ఎర్రకోటపై చేరుకొని అక్కడ జెండాను ఎగురవేశారు. తొలిసారి జెండా ఎగురవేసిన వెంటనే హెలికాఫ్టర్ల ద్వారా పూల వర్షాన్ని కురిపించింది వాయుసేన. 

ఇక నిన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ... స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల్ని ఎన్నటికీ మరచిపోలేమని అన్నారు. కరోనా ఉద్ధృతిని తట్టుకొనేందుకు యుద్ధప్రాతిపదికన వైద్య వసతులు కల్పించామని, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కృషివల్లే కరోనా సెకండ్‌ వేవ్‌పై పైచేయి సాధించగలుగుతున్నామని రామ్‌నాథ్ గుర్తుచేశారు. 

కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయరంగంలో పురోగతి సాధించామని.. కరోనా వల్ల వ్యాపారులు, వలసదారులు తీవ్రంగా ప్రభావితమయ్యాని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా రంగాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 50 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ జరిగిందని... సులభతర జీవనం, వాణిజ్యంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది అని రామ్‌నాథ్ కోవింద్ వివరించారు.