భారత్- చైనా సరిహద్దుల్లో గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు వీర మరణం పొందగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై యావత్ దేశం రగిలిపోతోంది.

చైనాకు ధీటైన సమాధానం చెప్పాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్  జరిపి పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పినట్లుగానే చైనాపైనా ప్రతీకారం తీర్చుకోవాలని భారతీయులు కోరుతున్నారు.

ఈ పరిస్ధితుల్లో దేశ ప్రజలు ప్రధాని మోడీపై అపార విశ్వాసం కనబరుస్తున్నారు. పాకిస్తాన్‌ను మించి ఇబ్బందిపెడుతున్న చైనా సమస్యను ఎదుర్కోవడానికి నరేంద్రమోడీయే సరైన నాయకుడని అభిప్రాయపడుతున్నారు.

Also Read:గాల్వన్ ఘర్షణ: ఆ రాత్రి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు ఇవి

ఈ నేపథ్యంలో జనం నాడీపై ఐఏఎన్ఎస్ సీఓటర్ స్నాప్ పోల్‌లో ఈ విషయం వెల్లడైంది. లఢఖ్‌లో ఘర్షణలు తలెత్తిన కొద్దిరోజుల తర్వాత ఈ సర్వే నిర్వహించారు. అదే సమయంలో ఇన్నాళ్లు దేశానికి తొలి శత్రువుగా భావించిన భారతీయులు ఇప్పుడు చైనాను మొదటి శత్రువుగా భావిస్తున్నారు.

డ్రాగన్‌ను ఢీకొట్టడానికి ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీల కంటే ఎన్డీయే ప్రభుత్వమే మెరుగైందని సర్వేలో పాల్గొన్న 73.6 శాతం మంది అభిప్రాయపడ్డారు. భారతదేశానికి చైనా పెద్ద తలనొప్పిగా మారిందని 68.3 శాతం మంది అభిప్రాయపడగా.. ఎప్పటికైనా దేశానికి పాకిస్తానే ప్రధాన శత్రువుగా 31.7 శాతం మంది అభిప్రాయపడ్డారు.

చైనాకు భారత్ ఇప్పటికీ సరైన జవాబు ఇవ్వలేదని 60 శాతం మంది భావిస్తుండగా.. మనదేశం సరైన జవాబిచ్చిందని 39.8 శాతం మంది చెబుతున్నారు. ఇక గాల్వన్ ఘర్షణ తర్వాత బాయ్‌కాట్ చైనా డిమాండ్‌పైనా ప్రజలు అభిప్రాయాలు తెలిపారు.

మేడిన్ చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయబోమని 68.2 శాతం మంది చెప్పగా... 31.8 శాతం మాత్రం కొనుగోలు చేస్తామని బదులిచ్చారు. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శల దాడి చేయడం సరికాదన్న ప్రజలు.. దేశ భద్రత విషయంలో రాహుల్ గాంధీని నమ్మబోమని 61.3 శాతం మంది చెప్పగా.. 39 శాతం మంది మంది ఆయన సమర్ధత పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు.