మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన ఏడేళ్ల కుమారుడిని 20 వేల రూపాయల అప్పుకు కుదువబెట్టాడు.
చెన్నై: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన ఏడేళ్ల కుమారుడిని 20 వేల రూపాయల అప్పుకు కుదువబెట్టాడు. ఆరు నెలల క్రితం కుదువబెట్టిన ఆ బాలుడికి బుధవారం విముక్తి లభించింది. బాలుడిని అతని తండ్రి విక్రయించినట్లు స్థానికులు చెబుతున్నారు.
తండ్రి రూ.20 వేల అప్పు తీర్చే వరకు కుమారుడిని కుదువబెట్టి ఉంటాడని బాల కార్మిక ప్రాజెక్టు చీఫ్ ప్రియ ఎన్డీటీవీతో అన్నారు. బాలుడు గ్రామంలో 50 గొర్రెలను కాస్తుండడంతో స్థానికులు ఆ విషయాన్ని ప్రభుత్వేతర సంస్థను, స్థానిక శిశు సంక్షేమ శాఖ అధికారులను అప్రమత్తంచేశారు.
ఆ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు ప్రియ చెప్పారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాలుడు తల్లిని కోల్పోయాడు. దాంతో తండ్రి అతని పెంపకంపై శ్రద్ధ పెట్టడం మానేశాడు. దాంతో రూ.20వేలకు కుమారుడిని ఇచ్చేసినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు.
ధర్మపురి జిల్లా నుంచి కుటుంబం కృష్ణగిరి జిల్లాకు వలస వచ్చింది. మద్యానికి బానిసైన తండ్రితోనూ, ఆంటీతోనూ ఆ బాలుడు నివసిస్తూ వచ్చాడు. బాలుడిని చిల్డ్రన్స్ హోంకు పంపించారు.
అధికారులు అతని సోదరుడికోసం, సోదరి కోసం గాలిస్తున్నారు. సోదరుడిని కూడా డబ్బుకు మరో వ్యక్తికి తండ్రి ఇచ్చి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు కాలేదు.
Last Updated 21, Jun 2018, 3:48 PM IST