న్యూఢిల్లీ : అయోధ్య రామమందిరం–బాబ్రీ మసీదుపై కేసులో నవంబర్‌ 17లోగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో భారత్ లో భారీ కుట్రకు తెరలేపారు పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు. 

త్వరలో అయోధ్యకేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో భారత్‌లో అలజడి సృష్టించేందుకు ఏడుగురు ఉగ్రవాదులు ఉత్తర ప్రదేశ్ లోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. నేపాల్‌ గుండా వారు ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. 

ఇకపోతే నవంబర్ 17న సుప్రీం కోర్టు అయోధ్య రామజన్మభూమిపై తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో యూపీలో విధ్వంసం జరిపేందుకే ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించినట్టుగా ఇంటెలిజెన్స్ విభాగం తెలిపింది. 

ఉగ్రవాదులు ప్రస్తుతం అయోధ్య, గోరఖ్‌పూర్‌లలో తలదాచుకుని ఉంటారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో యూపీ ప్రభుత్వాన్ని నిఘా వర్గాలు అప్రమత్తంగా చేశాయి.

భారత్‌లోకి ప్రవేశించిన ఏడుగురిలో ఐదుగురు ఉగ్రవాదులను నిఘా వర్గాలు గుర్తించాయి. మహమ్మద్‌ యాకుబ్‌, అబూ హమ్జా, మహమ్మద్‌ షాబాజ్‌, నిసార్‌ అహ్మద్‌, మహమ్మద్‌ ఖౌమి చౌదరిలను గుర్తించగా మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. 

అయితే ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది పాక్ కు చెందిన వారేనని తెలిపింది. ఇకపోతే నేపాల్ నుంచి ఉత్తరప్రదేశ్ లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ వేస్తున్నారని తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. 

రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెలవడనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఉగ్రవాదులు ప్రవేశించారన్న సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, అవసరమైతే రాష్ట్రంలో శాంతిభద్రతలను నిర్వహించడానికి జాతీయ భద్రతా చట్టం విధిస్తామని ఉత్తరప్రదేశ్ డిజిపి ఓపి సింగ్ తెలిపారు. 

ఇకపోతే అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు కేసును భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం 40 రోజుల పాటు విచారించింది. అనంతరం తీర్పును అక్టోబర్ 16, 2019 న రిజర్వు చేసింది. 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణకు ముందు నవంబర్ 17 లోపు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో 2.77 ఎకరాల భూమి యాజమాన్యం కేసులో  తీర్పును వెల్లడించనున్న సంగతి తెలిసిందే. 

ఈ వార్తలు కూడా చదవండి

Video: అయోధ్య కేసు: రవిశంకర్ కమిటీ నివేదికనే పరిష్కారం?