సారాంశం

మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరణ మృదంగం మోగుతోంది. నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో తాజాగా మరో  ఏడుగురు కూడా మృతిచెందారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మరణ మృదంగం మోగుతోంది. నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో  24 గంటల వ్యవధిలో 24 మరణాలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా మరో  ఏడుగురు కూడా మృతిచెందారు. వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. దీంతో నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో.. గత 48 గంటల్లో మరణించిన వారి సంఖ్య 31కి చేరుకుంది. ఈ 31 మందిలో.. 16 మంది శిశువులు లేదా పిల్లలు ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వైద్యుల నిర్లక్ష్యం ఆరోపణలను ఆసుపత్రి డీన్ డాక్టర్ శ్యామ్‌రావ్ వాకోడ్ తోసిపుచ్చారు. మందులు లేదా వైద్యుల కొరత కూడా లేదని.. సరైన సంరక్షణ అందించినప్పటికీ రోగులకు చికిత్సకు స్పందించడం లేదని ఆయన తెలిపారు. 

ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మహారాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ నాందేడ్‌కు బయలుదేరారు. ‘‘నేను నాందేడ్‌కు వెళ్తున్నాను. ఇది జరగాల్సింది కాదు. మందులు లేదా వైద్యుల కొరత లేదు. మేము ప్రతి మరణంపై దర్యాప్తు చేస్తాము. ఏదైనా నిర్లక్ష్యంగా తేలితే ఎవరైనా శిక్షించబడతారు’’ అని మంత్రి పేర్కొన్నారు. 

ఈ మరణాలపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. 

నాందేడ్ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన మరణాలతో రాష్ట్రంలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. ఈ ఘటన చాలా బాధాకరమైనది, తీవ్రమైనది, ఆందోళనకరమైనది అని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి వివరణాత్మక విచారణకు డిమాండ్ చేశారు. ఆగస్టులో థానేలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 18 మంది రోగులు స్వల్ప వ్యవధిలో మరణించిన సంఘటనను కూడా మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మహారాష్ట్రలో అధికార కూటమిలో భాగంగా ఉ్న బీజేపీని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ టార్గెట్ చేశారు. ‘‘బీజేపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం వేల కోట్లు ఖర్చు పెడుతుంది కానీ, పిల్లలకు మందులు కొనడానికి డబ్బులు లేవా?’’ అని రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.