తమ ప్రజాశాంతి పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో 60శాతం ప్రజల మద్దతు ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఢిల్లీలో అన్నారు. 

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీకి 60 శాతం ప్రజల మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు KA Paul అన్నారు. ఢిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు వంటి ఏ ఒక్క హామీని కెసిఆర్ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడివి కుటుంబ పార్టీలని, వారు ఇకనైనా తమ తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించవద్దని, బ్యాలెట్ పత్రాలు వినియోగించాలని అన్నారు. ఈ అంశం మీద 18 ప్రధాన పార్టీల నేతలతో కలిసి చర్చించినట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని విమర్శించారు. 

ఇదిలా ఉండగా, మే 13న తనపై కేసీఆర్, కేటీఆర్ లు దాడి చేయించారని ఆ దాడి పరిణామాలను వారు త్వరలోనే చూస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మే 12 రాత్రి ఆయన కలిశారు. తర్వాత పాల్ మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలను తన జీవితంలో ఏనాడు చూడలేదన్నారు. అమిత్ షాతో తాను అనేక విషయాలు చర్చించినట్లు తెలిపారు. కెసిఆర్, కేటీఆర్ల అవినీతితో రాష్ట్రంలో లక్షల కోట్లు మాయమయ్యాయని ఆరోపించారు. 

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కె.ఎ.పాల్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు రూ. 8 లక్షల కోట్లు ఉంటే తెలంగాణ అప్పు రూ. నాలుగున్నర లక్షల కోట్లు ఉంది. ఇలాగే చేసుకుంటూ పోతే దేశం మరో శ్రీలంక అవుతుందని అమీషాకు తెలిపినట్టు వెల్లడించారు. ప్రజాశాంతి భవిష్యత్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు. తెలంగాణ డీజీపీని కలిసేందుకు సమయం అడిగితే ఇవ్వలేదని… కేంద్ర హోంశాఖ మంత్రి అడగగానే సమయం ఇచ్చారని అన్నారు. ఆయన ప్రధాన మంత్రి మోదీని కలవాలని అమిత్షా సూచించారని ఆయన తెలిపారు.

కాగా, మే 2న సిద్దిపేట జిల్లాలోని జక్కాపూర్ లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై మే2 నాడు దాడికి ప్రయత్నించారు. రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయమై తమకు సమాచారం రావడంతో రైతులను పరామర్శించేందుకు వెళ్లాలని కేఏ పాల్ చెప్పారు. అయితే కేఏ పాల్ పర్యటన విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు.