ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తనమీద జరిగిన దాడి నేపత్యంలో ఆయన అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఢిల్లీ : తనపై KCR, KTR లు దాడి చేయించారని ఆ దాడి పరిణామాలను వారు త్వరలోనే చూస్తారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA Paul అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి Amithshahను గురువారం రాత్రి ఆయన కలిశారు. తర్వాత పాల్ మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలను తన జీవితంలో ఏనాడు చూడలేదన్నారు. అమిత్ షాతో తాను అనేక విషయాలు చర్చించినట్లు తెలిపారు. కెసిఆర్, కేటీఆర్ ల అవినీతితో రాష్ట్రంలో లక్షల కోట్లు మాయమయ్యాయని ఆరోపించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు రూ. 8 లక్షల కోట్లు ఉంటే తెలంగాణ అప్పు రూ. నాలుగున్నర లక్షల కోట్లు ఉంది. ఇలాగే చేసుకుంటూ పోతే దేశం మరో శ్రీలంక అవుతుందని అమీషాకు తెలిపినట్టు వెల్లడించారు. ప్రజాశాంతి భవిష్యత్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని తెలిపారు. తెలంగాణ డీజీపీని కలిసేందుకు సమయం అడిగితే ఇవ్వలేదని… కేంద్ర హోంశాఖ మంత్రి అడగగానే సమయం ఇచ్చారని అన్నారు. ఆయన ప్రధాన మంత్రి మోదీని కలవాలని అమిత్షా సూచించారని ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా, మే 2న సిద్దిపేట జిల్లాలోని జక్కాపూర్ లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA Paul పై మే2 నాడు దాడికి ప్రయత్నించారు. రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయమై తమకు సమాచారం రావడంతో రైతులను పరామర్శించేందుకు వెళ్లాలని కేఏ పాల్ చెప్పారు. అయితే కేఏ పాల్ పర్యటన విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు.

రాజన్న సిరిసిల్లకు వెళ్లే మార్గంలో కేఏ పాల్ ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే, ఈ విషయం మీద కేఏ పాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే రాజన్న సిరిసిల్లకు వెళ్లకుండా TRS శ్రేణులు అడ్డుకోవడంతో పోలీసులతో ఈ విషయమై కేఏ పాల్ మాట్లాడుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం జక్కాపూర్ వద్ద ఈ విషయమై కేఏ పాల్ మాట్లాడుతుండగా.. అదే సమయంలో జిల్లెల్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కేఏ పాల్ పై దాడికి దిగారు.ఈ విషయమై కేఏ పాల్ అనుచరులు, టీఆర్ఎస్ శ్రేణులకు మధ్య ఘర్షణ, తోపులాట చోటు చేసుకుంది. 

ఈ దాడి జరిగిన తర్వాత వెంటనే పోలీసులు కేఏ పాల్ ను కారులో కూర్చోబెట్టి అక్కడి నుంచి పంపించి వేశారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇప్పటివరకు ఇచ్చిన హామీలను కేసీఆర్ సర్కార్ అమలు చేయలేదని పాల్ విమర్శలు చేశారు. తనపై దాడి వెనుక కేసీఆర్, కేటీఆర్ లు ఉన్నారని ఆయన ఆరోపించారు. తనను చంపించేందుకు కేటీఆర్, కేసీఆర్ లు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన ఓ టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ బండారం బయటపెడుతున్నందుకే తనపై దాడి చేశారన్నారు.

గతంలో తాను కేసీఆర్ కు తాను సపోర్ట్ చేశానని కేఏ పాల్ చెప్పారు. తాను మద్దతిచ్చినందుకే కేసీఆర్ విజయం సాధించారన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో తన కార్యక్రమాలకు కేసీఆర్ సర్కార్ అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఇదిలా ఉంటే కేఏ పాల్ పై దాడి చేసిన కార్యకర్తను అనిల్ గా పోలీసులు గుర్తించారు. డీఎస్పీ సమక్షంలోనే తనపై టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేశారని కేఏ పాల్ చెప్పారు.