Asianet News TeluguAsianet News Telugu

పురుట్లోనే బిడ్డ చనిపోయినా, మృతశిశువు జన్మించినా.. 60 రోజుల ప్రసూతి సెలవులు..

పురుట్లోనే శిశువు చనిపోయినా, మృతశిశువు జన్మించినా ఆ మహిళకు ప్రత్యేక అవసరం కింద 60 రోజుల ప్రసూతి సెలవులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది.  

60 days maternity leave for still birth or loss of newborn child
Author
First Published Sep 3, 2022, 9:49 AM IST

ఢిల్లీ : పురుట్లోనే శిశువు చనిపోవడం ఏ తల్లికైనా కోలుకోలేని మానసిక క్షోభను కలిగిస్తుంది. నవమాసాలు మోసి, ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న తమ బంగారుపంటకు పుట్టుకతోనే నూరేళ్లు నిండడం తట్టుకోవడం కష్టం. అందుకే అలా పుట్టిన వెంటనే బిడ్డ చనిపోయిన మహిళలకు ఉపశమనం కలిగించడానికి, వారిని మానసికంగా కోలుకునేలా చేయడానికి కేంద్రప్రభుత్వం తమ మహిళా ఉద్యోగుల కోసం కొత్త నిర్ణయం తీసుకుంది.

పుట్టిన వెంటనే బిడ్డ మరణించినా, మృతశిశువు జన్మించినా 60 రోజుల ప్రత్యేక ప్రసూతి సెలవులు మంజూరు చేస్తూ కేంద్ర సిబ్బంది,  శిక్షణ విభాగం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది.  శిశువు మరణిస్తే తల్లి పడే మానసిక క్షోభను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

నిత్యానందకు తీవ్ర అనారోగ్యం.. వైద్య సాయం అందించాల‌ని శ్రీలంక అధ్య‌క్షుడికి లేఖ‌

ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు ఇటీవలి ఇలాంటి విషయంలోనే ఓ సంచలన తీర్పు ఇచ్చింది. కుటుంబం అంటే తండ్రి, తల్లి పిల్లలనే సంప్రదాయ భావన ఉందని, దీనికి భిన్నమైన రూపాల్లోనూ కుటుంబ సంబంధాలు ఉండొచ్చని, వాటికి చట్టపరమైన రక్షణ అవసరమనే అభిప్రాయాన్ని ఆగస్ట్ 29న సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. అవివాహిత భాగస్వామ్యాలు, స్వలింగ సంపర్కం లాంటి సంబంధాలు ఈ భిన్నమైన రూపాల కిందికి వస్తాయని న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎఎస్ బోపన్న ధర్మాసనం పేర్కొంది. గత వివాహబంధంలో భర్తకు పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకరి సంరక్షణకు మహిళ ప్రసూతి సెలవు తీసుకున్నందున, ఇప్పుడు తాను జన్మనిస్తున్న బిడ్డకు చట్టపరంగా సెలవు నిరాకరించడం సరికాదని ఓ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది.

కాగా, జూలై 16న ఇలాంటి కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స‌రోగ‌సి ద్వారా త‌ల్లులు అవుత‌న్న మ‌హిళ‌ల‌కు సంబంధించిన సెలవుల విషయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అద్దె గ‌ర్భం ద్వారా త‌ల్లి అయిన  మ‌హిళ‌లకు ప్ర‌సూతి సెల‌వులు పొంద‌డానికి అర్హత ఉందని ఆంధ‌ప్ర‌దేశ్ హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయ‌స్థానాని ఆశ్ర‌యించిన స‌ద‌రు మ‌హిళ‌కు ప్ర‌సూతి సెల‌వులు మంజూరు చేయాలని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. 

ఈ ఏడాది మార్చి 8న ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 33లోని నిబంధనలకు లోబడి కోర్టును ఆశ్ర‌యించిన స‌ద‌రు మ‌హిళ‌కు అడాప్షన్‌ లీవ్‌/మెటర్నిటీ లీవ్‌ (మాతృత్వపు సెలవు)లు ఇవ్వాల‌ని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. ఉప్పలపాడు జిల్లాపరిషత్‌ హైస్కూల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పి. సౌధామణి సరోగ‌సి విధానం ద్వారా ఇటీవ‌లే త‌ల్లి అయ్యారు. ఈ క్ర‌మంలో ఆమె ప్రసూతి సెలవుల‌ు కావాలంటూ.. అభ్యర్థన చేశారు. దీన్ని సంబంధిత శాఖ అధికారులు తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు.  

సౌదామణి, ఆమె భర్త తమకు పిల్లలు పుట్టకపోవడంతో.. మరొక మహిళతో సరోగసీ కోసం ఒప్పందం చేసుకున్నారు. ఆ మహిళ ప్రసవానంతరం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబ‌ర్ 33 ప్రకారం.. సరోగసి ద్వారా పుట్టిన బిడ్డను దత్తత తీసుకున్నారు. ఆ తరువాత మెటర్నిటీ బెనిఫిట్ చట్టం ప్రకారం 180 రోజుల పాటు పిల్లల దత్తత సెలవు కోసం సౌదామణి దరఖాస్తు చేసుకుంది. అయితే, సెలవు దరఖాస్తును ఆమె ఉన్నతాధికారులు తిరస్కరించారు. దీంతో ఆ ఉపాధ్యాయురాలు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios