దేశ రాజధాని ఢిల్లీలో మహిళలు, చిన్నారులపై దాడులు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆమెను మార్కెట్‌లో పడేసి వెళ్లిపోయారు కామాంధులు. శనివారం సాయంత్రం తన ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారి.. కనిపించకుండా పోయింది. ఆమె కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన బాలిక కుటుంబసభ్యులకు ఆచూకీ దొరకలేదు. ఇక చేసేది లేక తమ కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు పాప కోసం గాలింపుచర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం కమలా మార్కెట్ ప్రాంతంలో పాప అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను హస్పిటల్‌కు తరలించగా.. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఆమె అత్యాచారానికి గురైనట్లు తెలిపారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు.