కాలి నడకన తన అమ్మమ్మతో కలిసి ఓ చిన్నారి ఊరు ప్రయాణం మొదలుపెట్టింది. అయితే.. కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరకకపోవడంతో.. ఆ చిన్నారి దారిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇక ఆ చిన్నారి పక్కనే ఆమె అమ్మమ్మ కూడా  స్పృహ కోల్పోయి పడిపోయి ఉండటం గమనార్హం. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి  వివరాలు ఇలా ఉన్నాయి.

ఓ ముసలావిడ.. తన ఐదేళ్ల మనవరాలితో కలిసి.. తన సోదరి ఇంటికి వెళ్లాలని అనుకుంది. వీరిద్దరూ రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతున్నారు. తిండి, నీరు ఏమీ తీసుకోకపోవడం వల్ల దాహార్తి తీరకపోవడంతో చిన్నారి తట్టుకోలేకపోయింది.

శరీరమంతా డీ హైడ్రేట్ అయిపోయి.. ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సదరు ముసలావిడ కూడా డీ హైడ్రేట్ అయ్యింది. అయితే.. స్పృహ కోల్పోయి.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనపడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలచివేసింది.

వారు ఉన్న ప్రాంతం నుంచి ముసలావిడ తన సోదరి ఇంటికి చేరుకోవడానికి కనీసం పది కిలోమీటర్లు నడవాల్సి ఉంది. అయితే.. వారు కనీసం మంచినీరు కూడా వెంట పెట్టుకోకుండా.. ఆ ఎడారిలో నడుచుకుంటూ వెళ్లారు. దీంతో.. శరీరం డీ హైడ్రేట్ అయిపోయింది. ఆ ముసలావిడకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు స్థానిక పోలీసులు, అధికారులు తెలిపారు.