దంతెవాడ: ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు.  దంతెవాడ జిల్లాలో వారు గురువారంనాడు ఓ బస్సును పేల్చేశారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఐదు రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నక్సలైట్లు ఈ చర్యకు పాల్పడ్డారు. 

కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలకు (సిఐఎస్ఎఫ్ కు) చెందిన ఓ జవానుతో పాటు నలుగురు పౌరులు మరణించారు. మృతి చెందినవారిలో బస్సు డ్రైవర్, కండక్టర్, క్లీనర్ ఉన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ రేపు (శుక్రవారం) జగదల్పూరులో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. ఈ ప్రాంతం సంఘటన జరిగిన స్థలానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

మార్కెట్లో సరుకులు కొనుక్కుని సిఐఎస్ఎఫ్ బలగాలు శిబిరానికి తిరిగి వస్తుండగా మావోయిస్టులు దంతెవాడ జిల్లాలోని బాచేలి ప్రాంతంలో బస్సును పేల్చారు. తొలి దశ పోలింగ్ సందర్భంగా అక్కడ సిఐఎస్ఎఫ్ యూనిట్ ను మోహరించారు. 

ఛత్తీస్ గడ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ రెండు దశల్లో నవంబర్ 12, 20 తేదీల్లో జరగనుంది. తొలి దశ పోలింగ్ నక్సల్స్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలో జరుగుతుంది.