Asianet News TeluguAsianet News Telugu

ఈడీ దూకుడు.. సోదాల్లో 91కిలోల బంగారం, 340 కిలోల వెండి సీజ్..   విలువెంతంటే

బ్యాంకుల్ని మోసం చేసి.. ఓ సంస్థ వేల కోట్లు రుణాలు తీసుకుంది. తిరిగి చెల్లించ‌క‌పోవ‌డంతో మనీలాండ‌రింగ్ కేసు న‌మోదు కాగా.. ఆ కేసులో ఈడీ సోదాలు నిర్వ‌హించింది. ఆ సోదాల్లో మూడు రహస్య లాకర్ల నుంచి భారీగా బంగారం కడ్డీలు, వెండిని స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ.47 కోట్లకు పై మాటే..  
 

431 Kg Gold, Silver Seized From Secret Lockers Of Firm In Bank Fraud Case
Author
First Published Sep 15, 2022, 12:10 AM IST

బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయల‌ను రుణంగా తీసుకుంది ఓ సంస్థ‌. అప్పుల‌ను తిరిగి చెల్లించ‌కుండా.. ఎగ్గొట్టింది. దీంతో ఆ సంస్థపై మ‌నీలాండ‌రింగ్ కేసు న‌మోదైంది. ఈ నేప‌థ్యంలో ఈ కేసులో ఈడీ సోదాలు నిర్వ‌హిస్తుంది. ఈ విచార‌ణ‌లో ఆ సంస్థ‌కు మూడు రహస్య లాకర్లు ఉన్న‌ట్లు ఈడీ గుర్తించింది. ఆ ర‌హ‌స్య తెరిచి చూసిన ఈడీ అధికారులు కంగుతిన్నారు. ఆ లాకర్లలో భారీ మొత్తంలో బంగారం, వెండి కడ్డీలు బ‌య‌ట‌ప‌డ్డాయి. లాకర్లలో 91.5 కిలోల బంగారం, 340 కిలోల వెండి ఉన్న‌ట్టు గుర్తించారు.  జాతీయ మార్కెట్లో వాటి విలువ సూమారు రూ. 47 కోట్లకు పై మాటే.
 
వివ‌రాల్లోకెళ్తే..  పరేఖ్ అల్యూమినెక్స్ లిమిటెడ్ అనే సంస్థ‌ పలు బ్యాంకులను మోసం చేసి.. దాదాపు  రూ. 2296.58 కోట్ల రుణం తీసుకుంది. అయితే.. ఆ రుణాన్ని తిరిగి చెల్లించ‌క‌పోవ‌డంతో.. ఆ సంస్థ‌పై 2018లో మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసును ఈడీ విచారిస్తుంది. విచారణలో భాగంగా..  ఆ సంస్థ‌కు సంబంధించిన  రక్షా బులియన్‌, క్లాసిక్‌ మార్బల్స్‌ కంపెనీ పేర్ల మీద కొన్ని ప్రైవేటు లాకర్లు ఉన్నట్టు గుర్తించింది, అలాగే.. ఈ సోదాల్లో కొన్ని రహస్య లాకర్ల తాళాలు లభ్యమైనట్లు ఈడీ ప్రకటించింది.

ఈ క్ర‌మంలో బుధ‌వారం నాడు ఆ ర‌హ‌స్య లాకర్ల‌ను తెరిచిన అధికారుల‌కు దిమ్మ తిరిగింది. ఆ లాక‌ర్ల లో నుంచి భారీ మొత్తంలో బంగారం, వెండి బ‌య‌ట‌ప‌డింది. అలాగే.. ఎటువంటి నిబంధనలను పాటించకుండా లాకర్లు నడుస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, కేవైసీ అనుసరించబడలేదు, ఆ ప్రాంగణంలో సీసీ కెమెరాలను అమర్చ‌లేదు, ఆ లాక‌ర్ల‌ను తీయ‌డానికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారనే సమాచారం తెలిపే సరైన రిజిస్టర్‌ కూడా నిర్వహించలేదని గుర్తించినట్టు అధికారులు తెలిపారు.

అలాగే, ఆ కాంప్లెక్స్ లో మొత్తం 761 లాకర్లు ఉండగా.. వాటిలో మూడు లాకర్లు రక్షా బులియన్‌కు చెందినవిగా గుర్తించినట్టు పేర్కొన్నారు. మొద‌టి రెండు లాకర్లను తెరవగా అందులో 91.5కిలోల బంగారు కడ్డీలు, 152 కిలోల వెండి గుర్తించామనీ.. మరో లాకర్‌లో 188కిలోల వెండి (మొత్తంగా 340 కిలోలు) ఉందని ఈడీ అధికారులు వివరించారు. వీటి మొత్తం విలువ అంత‌ర్జాతీయ మార్కెట్ లో రూ.47.76 కోట్లు ఉంటుందని తెలిపారు. మరోవైపు, ఇదే కేసుకు సంబంధించి 2019లో ఈడీ అధికారులు రూ.205 కోట్లు అటాచ్‌ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios