కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. వచ్చే మూడేళ్లలో 400 కొత్త వందే భారత్ ట్రైన్లను తయారు చేస్తామని వెల్లడించారు. ఈ ట్రైన్‌లు ఎనర్జీ ఎఫీషియెంట్‌గా ఉంటాయని తెలిపారు. వన్ స్టేషన్- వన్ ప్రోడక్ట్ విధానంతో ఈ ట్రైన్‌ల ద్వారా రైతులు, చిన్న వ్యాపారులకూ అండగా నిలవనున్నట్టు వివరించారు.

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) ఈ రోజు పార్లమెంటులో బడ్జెట్(Budget 2022) ప్రవేశపెడుతూ రైల్వే(Railway Budget) సేవలపై కీలక ప్రకటనలు చేశారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వం 400 కొత్త వందే భారత్ ట్రైన్ల(Vande Bharat Trains)ను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ ట్రైన్లు తక్కువ ఇంధనంతో నడిచేవిగా రూపొందిస్తామని తెలిపారు. కనీసం 2000 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను ‘కవచ్’ కిందకు తెస్తామని వివరించారు. సేఫ్టీ కెపాసిటీ అనుకూలమైన ప్రపంచ శ్రేణి టెక్నాలజీనే ఈ కవచ్. అదే విధంగా వచ్చే మూడేళ్లలో 100 కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వీటిని మల్టీ మోడల్ లాజిస్టిక్ ఫెసిలిటీలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ వివరాలు వెల్లడించారు.

అలాగే, రైతుల ప్రయోజనాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఉపయోగంగా ఉండేలా ‘వన్ స్టేషన్- వన్ ప్రొడక్ట్’ విధానాన్ని అవలంభిస్తామని వివరించారు. తద్వార ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఉత్పత్తులను ఆ రైల్వేలపై సులువుగా తరలించడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఇలా కొత్త ఉత్పత్తులను రైల్వే శాఖ ముందుకు తెస్తుందని పేర్కొన్నారు. వీటితోపాటు రైల్వే ద్వారా పోస్టల్ పార్సిల్‌ సేవలనూ అందిస్తామని చెప్పారు. తద్వారా కొత్త బిజినెస్ ఏరియాలకు ఈ సేవలు గణనీయంగా ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. అంటే.. త్వరలో పోస్టల్ సేవల కోసం రైల్వేలనూ ఉపయోగించనున్నట్టు తెలుస్తున్నది. పీఎం గతి శక్తి కింద ఈ భారీ ప్రణాళిక ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.

ఈ 400 వందే భారత్ రైళ్లు ఎనర్జీ ఎఫీషియెంట్‌గా ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం ట్రైన్లను స్టీల్‌తో తయారు చేశారు. కానీ, ఈ వందే భారత్ రైళ్లను లైట్ వెయిట్ అల్యూమినియంతో తయారు చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. తద్వారా రైల్వే కోచ్‌లను భారత్ సంప్రదాయంగా ఉపయోగిస్తున్న స్టీల్‌ను పక్కన పెట్టి అల్యూమినియం లోహాన్ని వినియోగించనుంది. అయితే, ఈ అల్యూమినియం ద్వారా కోచ్‌లను తయారు చేయడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని తెలుస్తున్నది. వందే భారత్ ట్రైన్‌లో 16 కోచ్‌లు ఉంటాయి. ప్రస్తుతం ఈ 16 కోచ్‌ల తయారీకి సుమారు రూ. 106 కోట్లు వ్యయం అవుతుంది. కానీ, లైట్ వెయిట్ అల్యూమినియం‌తో ఈ 16 కోచ్‌ల సెట్‌ను తయారు చేయడానికి అదనంగా మరో రూ. 25 కోట్లు ఖర్చు పట్టవచ్చని తెలిసింది. కానీ, ఈ అల్యూమినియం కోచ్‌ల వల్ల ఇందన వినియోగం చాలా తక్కువగా ఉండనుంది. ట్రైన్ తయారీకి ఖర్చు ఎక్కువ అయినప్పటికీ.. దాని వినియోగం చాలా తక్కువ ఖర్చుతో జరగనుంది. అంటే.. రైల్వే శాఖ తన ఆదాయాన్ని పెంచుకునే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్నట్టు అవుతుందని అధికారులు వివరించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కార్ పదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో 2022 బడ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. బడ్జెట్ 2022 ప్రసంగాన్ని ప్రారంభించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నామని, క‌రోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్ర‌యత్నిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.