12:42 PM (IST) Feb 01

లోక్‌సభ రేపటికి వాయిదా

2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నర పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం సాగింది. అనంతరం స్పీకర్ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు.

12:41 PM (IST) Feb 01

బడ్జెట్.. మరికొన్ని ముఖ్యాంశాలు:

  • ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక కోసం ఉన్న‌త‌స్థాయి క‌మిటీ ఏర్పాటు.
  • ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్సీల‌కు రూ. 250 కోట్లు.
  • సుల‌భ‌త‌ర వాణిజ్య ప్రోత్సాహం రెండో ద‌శ ప్రారంభం.
  • 5 విద్యాసంస్థ‌ల‌కు ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్సీ హోదా.
  • మూల‌ధ‌న పెట్టుబ‌డుల కోసం రాష్ట్రాల‌కు కేంద్ర‌సాయం.
  • దేశ వ్యాప్తంగా మూల‌ధ‌న పెట్టుబ‌డుల కోసం రూ. 10.68 ల‌క్ష‌ల కోట్లు కేటాయింపు.
  • బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్ప‌త్తి కోసం 4 పైల‌ట్ ప్రాజెక్టులు.
  • దేశీయంగా సౌర విద్యుత్ ప్లేట్ల త‌యారీ ప్రోత్సాహ‌కానికి రూ. 19,500 కోట్లు
  • ప్ర‌యివేటు రంగంలో అడ‌వుల ఉత్ప‌త్తి కోసం నూత‌న ప‌థ‌కం.
  • రూ. 44 వేల కోట్ల‌తో అందుబాటు ధ‌ర‌ల్లో గృహాల నిర్మాణం.
  • ఉత్త‌ర స‌రిహ‌ద్దుల్లో గ్రామాల అభివృద్ధి కోసం ప్ర‌త్యేక ప‌థ‌కం.
  • 112 ఏస్పిరేష‌న్ జిల్లాల్లో 95 శాతం వైద్య సౌక‌ర్యాలు మెరుగుప‌డ్డాయి.
  • ర‌క్ష‌ణ రంగంలో ప్ర‌యివేటు సంస్థ‌ల‌కు అవ‌కాశం.
  • డీఆర్‌డీవో, ఇత‌ర ర‌క్ష‌ణ ప‌రిశోధ‌నా సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో ప్ర‌యివేటు సంస్థ‌ల‌కు అవ‌కాశం.
  • ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల దిగుమ‌తులు త‌గ్గించి స్వ‌యం స‌మృద్ధి సాధించేలా కృషి.
  • విద్యాసంస్థ‌లు, ప‌రిశోధ‌నా సంస్థ‌లు, ప్ర‌భుత్వ సంస్థ‌ల మ‌ధ్య బ‌ల‌మైన అనుసంధానం.
  • డ్రోన్ శ‌క్తి కార్య‌క్ర‌మంలో భాగంగా అంకుర సంస్థ‌ల‌కు ప్రోత్సాహం.
  • కాంట్రాక్ట‌ర్ల‌కు ఈ-బిల్లులు పెట్టుకునే అవ‌కాశం.
  • బిల్లుల వివ‌రాలు ఎప్ప‌టిక‌ప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకునే సౌక‌ర్యం.
  • ఎగుమ‌తుల వృద్ధికి పారిశ్రామిక సంస్థ‌ల‌కు నూత‌న ప్రోత్సాహ‌కాలు.
  • మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, అభివృద్ధి, వినియోగంపై దృష్టి.
  • గంగా ప‌రివాహం వెంబ‌డి నేచుర‌ల్ ఫార్మింగ్ కారిడార్.
  • ఎంఎస్ఎంఈల రేటింగ్‌కు రూ. 6 వేల కోట్ల‌తో ప్ర‌త్యేక ప‌థ‌కం.
  • ప్ర‌తి రాష్ట్రంలో కొన్ని ప్ర‌త్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.
  • ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మైన నైపుణ్యాభివృద్ధి కోసం అద‌న‌పు నిధులు, ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌లు.
  • ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు అవ‌కాశాలు.
  • వంట నూనెల కోసం దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డ‌కుండా దేశీయంగా ఉత్ప‌త్తి.
  • పీపీపీ మోడ‌ల్‌లో ఆహార శుద్ధి ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్రోత్సాహం.
12:34 PM (IST) Feb 01

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా .. వారికి కూడా ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్) డిడక్షన్ వుంటుందని ఆమె తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఎన్‌పీఎస్ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్మల చెప్పారు. 

12:31 PM (IST) Feb 01

2022-23 కేంద్ర బడ్జెట్‌లో ద్రవ్యలోటు 6.9 శాతం

2022-23 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ.39 లక్షల కోట్లని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్‌లో ద్రవ్యలోటు 6.9 శాతం కాగా.. 2025-26 నాటికి 4.5 శాతానికి తగ్గించడం తమ లక్ష్యమని ఆమె చెప్పారు. 

12:25 PM (IST) Feb 01

‘‘ట్యాక్స్‌’’పై నిర్మలమ్మ ఏం చెప్పారంటే..?

  • ట్యాక్స్ రిటర్న్స్ అప్‌డేట్ చేసేందుకు రెండేళ్ల సమయం.
  • రిటర్న్స్‌లో లోపాల సవరణకు ట్యాక్స్ పేయర్స్‌కు అవకాశం
  • సహకర సంస్థల పన్ను 15 శాతానికి తగ్గింపు
  • సహకార సంస్థల పన్నుపై సర్‌ఛార్జ్ 7 శాతానికి తగ్గింపు
  • స్టార్టప్‌లకు పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగింపు
  • కొత్తగా ఏర్పాటయ్యే దేశీయ తయారీ కంపెనీలకు పన్ను రాయితీలు
  • క్రిప్టో కరెన్సీలకు పన్ను రాయితీ లేదు
  • క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం పన్ను
12:21 PM (IST) Feb 01

రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు

కోవిడ్ మహమ్మారి కారణంగా ఆదాయం కోల్పోయి ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు వడ్డీ లేని అప్పులు ఇస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు ఇస్తామని తెలిపారు.

12:17 PM (IST) Feb 01

త్వరలోనే ఈ- పాస్‌పోర్ట్

త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ పాస్‌పోర్ట్ విధానం అందుబాటులోకి తెస్తామన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 

12:15 PM (IST) Feb 01

యానిమేషన్ కోసం టాస్క్‌ఫోర్స్

యానిమేషన్ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రత్యేక ఆర్ధిక మండళ్ల చట్టం స్థానంలో నూతన చట్టం తీసుకొస్తామని ఆమె తెలిపారు. 

12:13 PM (IST) Feb 01

త్వరలో దేశీయ క్రిప్టో కరెన్సీ

ఈ ఏడాది డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ అభివృద్ధి చెందుతుందని ఆమె చెప్పారు. బ్లాక్ చెయిన్ సాంకేతికతతో ఆర్‌బీఐ ఇందుకోసం రూపకల్పన చేస్తున్నట్లు నిర్మల తెలిపారు.

12:09 PM (IST) Feb 01

‘భారత్ నెట్ ప్రాజెక్ట్‌’.... గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ ఫైబర్ ఆప్టిక్ సేవలు

‘భారత్ నెట్ ప్రాజెక్ట్‌’లో భాగంగా పీపీపీ పద్ధతిలో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోనూ ఆప్టికల్ ఫైబర్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ ప్రాజెక్టు 2025 నాటికి పూర్తవుతుందని ఆమె చెప్పారు. 5జీ ద్వారా ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు ఇంకా పెరుగుతాయని ఆమె పేర్కొన్నారు. 

12:04 PM (IST) Feb 01

నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ ఎకో సిస్టమ్‌

కొత్తగా నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ ఎకో సిస్టమ్‌ రూపొందిస్తున్నామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సౌకర్యాలు, యునీక్‌ హెల్త్ ఐడెంటిటీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో ఉంచుతామని ఆర్ధిక మంత్రి తెలిపారు

12:03 PM (IST) Feb 01

ఈ ఆర్ధిక సంవత్సరంలోనే 5జీ సేవలు

2022-23 ఆర్ధిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులో తీసుకొస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తామని.. విద్యుత్ వాహనాల పెంపులో భాగంగా బ్యాటరీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని ఆర్ధిక మంత్రి చెప్పారు. 

12:01 PM (IST) Feb 01

త్వరలో వన్ నేషన్.. వన్ రిజిస్ట్రేషన్

దేశవ్యాప్తంగా భూ సంస్కరణల్లో భాగంగా వన్ నేషన్- వన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెడతామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం తీసుకొస్తామని చెప్పారు. 

11:57 AM (IST) Feb 01

దేశవ్యాప్తంగా 23 టెలీ మెంటల్ హెల్త్ సెంటర్స్

నేషనల్ డిజిటల్ హెల్త్ సిస్టం కోసం ఓ ఫ్లాట్‌ఫాం రూపొందిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో 23 టెలీ మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంటుందని ఆమె చెప్పారు. దీనికి నిమ్హాన్స్ నోడల్ సెంటర్‌గా, ట్రిపుల్ ఐటీ బెంగళూరు టెక్నికల్ సపోర్ట్ అందిస్తుందని నిర్మల తెలిపారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) మార్చి 2023 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. 

11:54 AM (IST) Feb 01

కొత్తగా నేషనల్‌ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్

కోవిడ్ మహమ్మారి కారణంగా దేశంలో అన్ని వయసుల వారు మానసిక అనారోగ్యానికి గురవుతున్నారని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వాళ్ల కోసం నాణ్యమైన మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్, సంరక్షణ సేవల కోసం నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నట్లు నిర్మల చెప్పారు

11:51 AM (IST) Feb 01

వ్యవసాయ వర్సిటీల సిలబస్‌లో మార్పులు

వ్యవసాయ వర్సిటీల సిలబస్‌లో మార్పులు చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీరో బడ్జెట్ ఫార్మింగ్, సేంద్రియ సాగుకు ప్రోత్సాహకాలు కల్పిస్తామని ఆమె చెప్పారు. 

11:49 AM (IST) Feb 01

కాలం చెల్లిన చట్టాల రద్దు... ఈశాన్య రాష్ట్రాల అభివృద్దికి నిధులు

దేశంలో కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.1500 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 

11:48 AM (IST) Feb 01

కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి పోస్టాఫిస్‌లు

దేశవ్యాప్తంగా వున్న పోస్టాఫిస్‌లను కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశం నలుమూలకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తామని.. 5 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఆర్ధిక మంత్రి తెలిపారు. 

11:45 AM (IST) Feb 01

విద్యార్ధుల కోసం వన్ క్లాస్- వన్ టీవీ ఛానెల్

కరోనా నేపథ్యంలో విద్యారంగంపై దృష్టి సారించామని.. పీఎం ఈ - విద్య ప్రోగ్రాం కింద వన్ క్లాస్ - వన్ టీవీ ఛానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతమున్న 12 ఛానెళ్ల నుంచి 200 ఛానెళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠాలను వాటిలో బోధిస్తామని నిర్మల చెప్పారు. ఇంటర్నెట్ , టీవీ ఛానెళ్లు, రేడియోల ద్వారా విద్యార్థులకు డిజిటల్ టీచర్ల ద్వారా హై క్వాలిటీ డిజిటల్ టీచింగ్ కంటెంట్‌ను చేరుస్తామని ఆర్ధిక మంత్రి తెలిపారు. 

11:42 AM (IST) Feb 01

ఎంఎస్ఎంఈల మార్కెటింగ్‌కు కొత్త పోర్టల్

ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకానికి కొత్తగా పోర్టల్ ప్రారంభిస్తామని ఆర్ధిక మంత్రి తెలిపారు. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం అందుబాటులోకి తెస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో యువత, మహిళల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా 2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తామని.. పీఎం ఆవాస్ యోజన పథకం కింద 80 లక్షల గృహాలను నిర్మిస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.