ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దేశంలో 40 లక్షల మంది కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు.  

కరోనా వైరస్‌ మరణాలకు (corona deaths in india) సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ (congress) ఎంపీ రాహుల్ గాంధీ (rahul gandhi). దేశంలో కోవిడ్ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 40లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి రూ.4 లక్షల రూపాయల పరిహారం అందించాలని రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్‌ చేశారు. ప్రపంచ వ్యాప్త కొవిడ్‌ మరణాలను బహిర్గతం చేయాలన్న డబ్ల్యూహెచ్‌వో ప్రయత్నాలకు భారత్‌ అడ్డుపడుతోందంటూ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’లో ప్రచురితమైన కథానాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసిన రాహుల్‌ గాంధీ.. కేంద్ర వైఖరిపై మండిపడ్డారు.

ప్రధాని మోదీ (narendra modi) వాస్తవాలు మాట్లాడరని... ఇతరులను మాట్లాడనివ్వరంటూ ఆయన దుయ్యబట్టారు. ఆక్సిజన్‌ కొరత కారణంగా ఏ ఒక్కరూ మరణించలేదని ఇంకా అబద్ధాలు చెబుతున్నారని రాహుల్‌ ఫైరయ్యారు. దేశంలో కొవిడ్‌ వల్ల ఐదు లక్షల మంది చనిపోలేదని.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 40 లక్షల మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు గతంలోనే చెప్పానని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు రూ.4లక్షల పరిహారాన్ని అందించే బాధ్యతను నెరవేర్చాలని కేంద్రానికి రాహుల్ సూచించారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం, దేశంలో 5 లక్షల 21వేల మంది కొవిడ్‌ బాధితులు చనిపోయారు.

దేశంలో కరోనా కారణంగా మృతి చెందినవారి సంఖ్యను లెక్కించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (world health organization) మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ (ministry of health and family welfare) ప్రశ్నించింది. జనాభాలో, విస్తీర్ణంలో ఇంత పెద్ద దేశానికి ఒక గణిత నమూనాను వర్తింపజేయడంలో ఔచిత్యాన్ని తప్పుబట్టింది. ఇదే అంశంపై తాజాగా ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ప్రచురించిన కథనాన్ని భారత్ ఖండించింది. కొన్ని దేశాలకు అనుసరిస్తున్న విధానాన్ని భారత్‌కూ వర్తింపజేయడం తగదని స్పష్టం చేసింది. తమ అభ్యంతరం ఫలితాల గురించి కాదనీ, దానికి అనుసరిస్తున్న విధానాన్నే తప్పు పడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య సంస్థ వెల్లడించింది.