కోల్‌కత్తా: వచ్చే ఏడాది అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు ముందే తృణమూల్ నాయకులు రాజకీయ శిబిరాలను మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మంగళవారం నాడు జరిగిన కేబినెట్ సమావేశానికి నలుగురు మంత్రులు హాజరు కాలేదు.

also read:రవీంద్రనాథ్ ఠాగూర్ కలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం: అమిత్ షా

కేబినెట్ సమావేశానికి హాజరు కాని నలుగురు మంత్రులు పార్టీ అధిష్టానానికి పూర్తి వివరణ ఇచ్చారు.  ఈ విషయాన్ని అధికార పార్టీ సెక్రటరీ జనరల్ పార్థా ఛటర్జీ చెప్పారు. అటవీశాఖ మంత్రి  రాబిన్ బెనర్జీ మాత్రం కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడంపై ప్రధానంగా చర్చ సాగుతోంది.

కొంత కాలంగా ఆయన అసమ్మతి గళం విన్పిస్తున్నారు. నవంబర్ మాసంలో కోల్‌కత్తాలో జరిగిన బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బెనర్జీ డోమ్జూర్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

గత వారం రోజుల క్రితం బీజేపీలో చేరిన టీఎంసీ నేత సువేంద్ అధికారికి, బెనర్జీ మధ్య విభేధాలు ఉన్నాయి.ఈ విభేదాల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం సాగుతోంది.

ఈ వ్యాఖ్యల తర్వాత వీరిద్దరి మధ్య రాజీ చేసేందుకు పార్టీ నాయకత్వం ప్రయత్నించింది.  తన సమస్యలను తన మాజీ సహచరులతో ముఖ్యంగా సువేంద్ అధికారితో ముడిపెట్టవద్దని ఆయన చెప్పారు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ సమావేశానికి ఆయన హాజరుకాకపోవడం ప్రస్తుతం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

కేబినెట్ సమావేశానికి గైర్హాజరైన మంత్రుల్లో కూచ్ బీహార్ కు చెందిన రవీంద్రనాథ్ ఘోష్ కూడ ఉన్నారు. డువారేలో ప్రచారాన్ని పర్యవేక్షణలో బిజీగా ఉన్నందున  రాలేకపోయినట్టుగా సమాచారం ఇచ్చారు.

డార్జిలింగ్ జిల్లాకు చెందిన పర్యాటక మంత్రి గౌతం దేబ్ అనారోగ్యం కారణంగా సమావేశానికి హాజరుకాలేదు. వచ్చే వారం సీఎం పర్యటనకు సిద్దమౌతున్నట్టుగా బీర్భూమ్ కు చెందిన చంద్రనాథ్ సిన్హా తెలిపారు.టీఎంసీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు పలువురు నేతలు ఈ నెల 19వ తేదీన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.


పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా మమత బెనర్జీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  ఇది ఆరంభం మాత్రమే అని ఆయన చెప్పారు. ఎన్నికల నాటికి మీరు మీ అల్లుడు మాత్రమే పార్టీలో మిగిలిపోతారని ఆయన చెప్పారు.

2011లో మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసిన నందిగ్రామ్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అధికారి అతని సహచరులు పార్టీని వీడడం టీఎంసీకి తీవ్ర దెబ్బగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.