కోల్‌కత్తా: బెంగాల్ లోని విశ్వభారతి యూనివర్శిటీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు సందర్శించారు. 

బెంగాల్ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు రెండో రోజు పర్యటించారు.  యూనివర్శిటీలోని విద్యార్ధులు, ఫ్యాకల్టీని ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగించారు. 

 

కోల్‌కత్తా నుండి బీర్‌భూమ్‌లోకి దిగిన తర్వాత శాంతినికేతన్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచంలో భారతీయ సంస్కృతిని బోధించిన గౌరవప్రదమైన రవీంద్రనాథ్ ఠాగూర్ కు నివాళి అర్పించే అవకాశం తనకు లభించే అవకాశం దక్కిందన్నారు. ఈ అవకాశం దక్కిన ఈ రోజు శుభ దినమన్నారు.

గురుదేవ్ ఠాగూర్, నేతాజీలకు స్పూర్తినిచ్చిన వ్యక్తిగా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశ్వభారతి, శాంతినికేతన్ ద్వారా గురుదేవ్ భారతీయ సంస్కృతి, జ్ఞానాన్ని, సాహిత్యాన్ని రక్షించారన్నారు. 

ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జానపద గాయకుడు బాసుదేవ్ బౌల్ నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. భోల్‌పూర్ లోని ఆయన నివాసంలో పార్టీ నేతలతో కలిసి ఆయన భోజనం చేశారు.

ఆ తర్వాత భోల్‌పూర్‌లో అమిత్ షా రోడ్ షో లో పాల్గొన్నారు.ఈ రోడ్‌షోలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్డుకు  ఇరువైపులా  నిలబడిన ప్రజలకు అమిత్ షా అభివాదం చేశారు.వచ్చే ఏడాదిలో బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.