డిల్లీలో భారీ ఎన్కౌంటర్, పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్ల హతం

4 Criminals Killed In Encounter In Delhi After Fierce Gunfight With Police
Highlights

ఆరుగురు పోలీసులకు కూడా తీవ్ర గాయాలు  

దేశ రాజధాని డిల్లీలో పట్టపగలే నడిరోడ్డుపై భారీ ఎన్ కౌంటర్ జరిగింది. డిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు, ఓ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్లకు మద్య ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు కరుడుగట్టిన నేరగాళ్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న ఆరుగురు పోలీసులు కూడా గాయపడ్డారు.

డిల్లీ లో రాజేష్ భారతి పెద్ద పేరుమోసిన గ్యాంగ్ స్టర్. అతడి కోసం పోలీసులు గత కొంత కాలంగా వెతుకుతున్నారు. అయితే ఇవాళ అతడు దక్షిణ డిల్లీ చత్రాపూర్ ప్రాంతంలో ఉన్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను పసిగట్టిన రాజేష్ గ్యాంగ్ వారిపై కాల్పులకు దిగింది.  దీంతో పోలీసులు వారిపై ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో రాజేష్  భారతి తో పాటు ముగ్గురు అనుచరులు మృతిచెందగా, దుండగుల కాల్పుల్లో ఆరుగురు పోలీసులు కూడా గాయపడ్డారు.

మృతుడు రాజేష్ తో పాటు అతడి అనుచరులపై పలు హత్యా, దొంగతనం కేసులు ఉన్నాయి. వీరి తలలపై పోలీసులు రివార్డులు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో పట్టుబడిన రాజేష్ హర్యానా పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. దీంతో అప్పటినుండి అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

loader