పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుని.. నాలుగు కుటుంబాలకు కన్నీటిని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం తిరువొత్తియూరు సమీపంలోని మనలి బల్జిపాళయంకు చెందిన రాకేశ్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఇంట్లో వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకలో పాల్గొనేందుకు రాకేశ్ స్నేహితులు 8 మంది అతని ఇంటికి వచ్చారు. కేట్ కటింగ్ అనంతరం మధ్యాహ్నం ఎన్నూరు సముద్ర తీరంలోని కేవీకుప్పం వద్దకు వెళ్లారు. ఐదుగురు మిత్రులు ఒడ్డునే ఉండిపోగా.. మిగిలిన నలుగురు మాత్రం సముద్రంలోకి వెళ్లి స్నానాలు చేస్తున్నారు.

ఈ సమయంలో ఓ రాకాసి అల వీరిని లాగేసింది. స్నానం చేస్తున్న మిత్రులు కనిపించకపోవడంతో ఒడ్డున ఉన్న మిత్రులు భయంతో కేకలు పెట్టగా.. సమీపంలో ఉన్న జాలర్లు వచ్చి నలుగురి కోసం గాలించి ధనుష్ మృతదేహాన్ని బయటకు తీశారు.

ఆదివారం చేపలవేటకు వెళ్లిన మత్య్సకారుల వలలో ఓ మృతదేహం పడగా.. మరో మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. వీరిని జయభారతి, సునీల్ కుమార్‌గా గుర్తించారు. గోకుల్‌నాథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.