కామాంధుల చేతుల్లో బలైపోయిన దిశకు న్యాయం చేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మహిళలను వేధిస్తున్న వారికి జనాలు దేహాశుద్ధి చేస్తున్న ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తాజాగా నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఓ 35 ఏళ్ల వ్యక్తిని పట్టుకున్న స్థానికులు బట్టలు విప్పించి రోడ్డుపై ఉరేగించారు. వివరాల్లోకి వెళితే.. నాగపూర్‌లోని పార్డి ప్రాంతానికి చెందిన జవహర్ వైద్య నగరంలోని ఓ సహకార బ్యాంక్ తరపున కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు.

Also read:జస్టిస్ ఫర్ దిశ: మొబైల్ ఫోన్ దొరకలేదు, 10 రోజుల కస్టడీ కోరిన పోలీసులు

ప్రతి రోజు ఇంటింటికి వెళ్లి డబ్బు వసూలు చేసేవాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఓ ఇంటికి వెళ్లిని అతనికి నాలుగేళ్ల బాలిక ఒంటరిగా కనిపించింది. ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.

ఇదే సమయంలో బయటికి వెళ్లిన ఆ బాలిక తల్లి ఇంటికి తిరిగి వచ్చి దారుణాన్ని చూసి, అలారంను మోగించింది. దీనిని విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని జవహర్‌ను చితకబాదారు.

అక్కడితో ఆగకుండా అతని బట్టలు విప్పించి, తాడుతో చేతులు కట్టేసి వీధుల్లో నగ్నంగా తిప్పి అనంతరం పోలీసులకు అప్పగించారు. జవహర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... నిందితుడిపై ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఈ క్రమంలో అత్యాచారానికి గురైన ఓ యువతి అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే...ఒడిషాకు చెందిన ఓ 23 ఏళ్ల మహిళా లెక్చరర్‌పై ఆమె దూరపు బంధువు అక్టోబర్ 20న అత్యాచారానికి పాల్పడ్డాడు.

దీనిపై బాధితురాలు అదే నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో శనివారం రాత్రి సదరు లెక్చరర్ తన హాస్టల్ గదిలో విగతజీవిగా పడివుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆమె మరణానికి కారణమైన ఆరుగురిపై ఐసీసీ సెక్షన్ 302 కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read:Justice for Disha: నిందితుడికి ప్రాణాంతక వ్యాధి, ఆర్నెళ్లకోసారి..

ఈ ఘటనపై మయూర్‌భంజ్ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ... లెక్చరర్ మరణానికి సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు జార్పోఖారియా పోలీస్ స్టేషన్‌ ఇన్‌ఛార్జి ఇన్‌స్పెక్టర్ శరత్ కుమార్ మహాలిక్‌ బదిలీ చేయంతో పాటు సబ్ ఇన్స్‌పెక్టర్ ప్రశాంత్ స్వైన్‌ను సస్పెండ్ చేశారు.