Parliament: లోక్ సభ నుంచి మరో 33 మంది ఎంపీలపై సస్పెన్షన్.. మొత్తం 46 మందిపై వేటు
పార్లమెంటులో మరో కీల పరిణామం చోటుచేసుకుంది. లోక్ సభలో ఇది వరకే 13 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన స్పీకర్.. తాజాగా మరో 33 మంది ఎంపీలపై ఈ వేటు వేశారు.
Parliament: లోక్ సభలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్య ఘటన తర్వాత పార్లమెంటులోని ఉభయ సభలు అట్టుడికిపోతున్నాయి. దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతాల్లో ఒకటైన పార్లమెంటులోకి ఆగంతకులు చొరబడి స్మోక్ క్యానిస్టర్‌లను విసిరేయడం, నియంతృత్వం ఇకపై నడవు అంటూ నినాదాలు చేయడం దేశాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు పట్టుబడుతున్నారు. సభలో తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ పలువురు ఎంపీలను సస్పెండ్ చేశారు. తాజాగా, 33 మంది విపక్ష ఎంపీలను లోక్ సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా 33 మందిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో ఇప్పటికే 13 మంది ప్రతిపక్ష ఎంపీలపై వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో లోక్ సభలో ఇప్పటి వరకు మొత్తం 46 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. రాజ్యసభలోనూ టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రియెన్ పై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే.
Also Read: Congress: తెలంగాణ నుంచి ఎంపీగా సోనియా గాంధీ పోటీ.. పీఏసీ మీటింగ్‌లో సంచలన తీర్మానం
ఈ రోజు సాయంత్రం స్పీకర్ మరో 33 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరంతా ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకూ సమావేశాలకూ దూరంగా ఉండనున్నారు. లోక్ సభాపతి ఆదేశాలను ధిక్కరించారని, వారిపై సస్పెన్షన్ వేటు వేయాలని కోరుతూ పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మూజువాణి ద్వారా సమ్మతం లభించింది. ఆ తర్వాత స్పీకర్ 33 మందిపై ఈ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. దీంతో మొత్తం 46 మంది లోక్ సభ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడినట్టయింది.
రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన డెరెక్ ఓబ్రియెన్ పార్లమెంటు ప్రాంగణంలోనే మౌన దీక్ష చేపట్టి నిరసన చేస్తున్నారు.
33 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. అప్పుడు ఆగంతకులు స్మోక్ బాంబ్‌లతో పార్లమెంటు పై దాడి చేస్తే.. ఇప్పుడు నరేంద్ర మోడీ పార్లమెంటు, ప్రజాస్వామ్యంపై దాడికి దిగారని ఫైర్ అయింది.
తాజాగా వేటుపడిన ఎంపీల్లో కాంగ్రెస్ ఎంపీలు అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, డాక్టర్ కే జయకుమార్, కే మురళీధరన్, ఆంటో ఆంటోనీ, సురేశ్ కొడికున్నిల్, డాక్టర్ అమర్ సింగ్, సు తిరునవుక్కరసర్, విజయ్ వాసంత్, రాజమోహన్ ఉన్నిథన్, అబ్దుల్ ఖాలేక్ సహా పలువురు డీఎంకే ఎంపీలు, ఏఐటీసీ ఎంపీలు, ఐయూఎంఎల్ ఎంపీ కూడా ఉన్నారు.